CM Chandrababu on Political Issues : ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై క్యాబినెట్ సమావేశానికి ముందు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చ లేవనెత్తారు. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడూ కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపైనా కీలక చర్చ జరిగింది.
మంత్రివర్గ సమావేశం ముగిశాక రాజకీయ అంశాలపై సీఎం చర్చించారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్లకు సరిగా స్పందించట్లేదని వారు వ్యాఖ్యానించారు. కింద స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇంట్లో మహిళల్ని కించపరిచేలా పెడుతున్న పోస్టులకు తట్టుకోలేకే తానూ తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నట్లు సమాచారం.
గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడికి తెద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులను ఇకపై ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వివిధ శాఖల్లో పలువురు అవినీతిపరులు అధికారులుగా చలామణి అవుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించినట్లు తెలిసింది.
డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం
Pawan Kalyan on Fake Posts : సోషల్ మీడియా పోస్టులకు తన ఇంటి ఆడబిడ్డలు కంటతడి పెట్టుకోవటం చూసి తట్టుకోలేకపోయానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఫేక్ పోస్టులతో ఆడ బిడ్డలు బయట తిరగలేని పరిస్థితులు ఉంటే సీరియస్ యాక్షన్ ఉండాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. కొన్ని సంఘటనల్లో మహిళ లేదా బాలికపై అత్యాచారం జరిగిందని, జరగలేదనీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చర్చ జరగటం సబబు కాదని అన్నారు. అత్యాచారం జరిగిందా లేదా అనే అంశంపై చర్చకు తావు ఇవ్వకుండా బాధితురాలు గౌరవప్రదంగా తిరిగే వాతావరణం కల్పించాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.
రుషికొండ భవనాలు ఏం చేద్దాం అనే అంశపైనా చర్చించారు. ప్రజా ధనం ఏ విధంగా దుర్వినియోగం జరిగిందో అందరికీ తెలిసేలా చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిన తీరును విద్యార్థులు, యువత వివిధ వర్గాలకు తెలిసేలా రుషికొండ భవనాలు చూపించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.
Deputy CM on Police : జగన్ ప్రభుత్వంలో చట్టాలు పక్కన పెట్టి మరీ, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేసిన పోలీసులు ఇప్పుడు మంచి చేయమన్నా చేయట్లేదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమర్శించారు. మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై అంతర్గతంగా చర్చించారు. పవన్ కల్యాణ్ మంత్రివర్గ సమావేశానికి రాకముందే సోషల్ మీడియా పోస్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చ ప్రారంభించారు. మన అతి మంచితనం చేతకాని తనం కాకూడదు అంటూ సీఎం సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో వచ్చిన పవన్ కల్యాణ్: చర్చ జరుగుతున్నప్పుడే పవన్ కల్యాణ్ మంత్రివర్గ సమావేశానికి వచ్చారు. తాను ఎందుకు అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందో పవన్ కల్యాణ్ మంత్రులకు తెలిపారు. తన ఇంట్లో మహిళలపైనా, లోకేశ్ కుటుంబంపైనా, పిల్లలపైనా ఇష్టానుసారంగా పోస్టులు పెడితే ఎలా సహిస్తామని నిలదీశారు. గత ప్రభుత్వ పెద్దలు ఏదైనా చెప్తే ముందూ వెనకా ఆలోచించకుండా పోలీసులు వ్యవహరించారన్న పవన్, మనం అలా కాకుండా చట్టప్రకారం పనిచేయమన్నా మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ అధికారుల వల్లే సమస్యలు: మన మంచితనం చేతకాని తనం అనే భావన వెళ్తుంటే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. వ్యవస్థను గాడిలోకి తెచ్చి శాంతి భద్రతల పరిరక్షణ అంటే ఏమిటో చూపిద్దామన్నారు. గత ప్రభుత్వ హ్యాంగోవర్ వీడని అధికారులు వల్లే సమస్యలు వస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
అక్రమార్కులకు వంతపాడే ఆ చట్టం, మరో జీవో రద్దు - రేపటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ?