AP CM Chandrababu at International Tribal Day Celebrations : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చిన చంద్రబాబుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం చేశారు.
అనంతరం గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించి, వారితో మమేకమయ్యారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులను ఉత్సాహ పరిచారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు. అనంతరం అరకు కాఫీ తాగిన సీఎం చంద్రబాబు, గిరిజనుల తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన శాల వద్దకు వెళ్లారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు.
Chandrababu Tweet Today : అంతర్జాతీయ గిరిజన దినోత్సవం వేళ రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలల్లో ఒకటని గుర్తుచేశారు. అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించామన్నారు.
అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రోత్సాహాన్ని అందించామని చెప్పారు. గిరిజన జాతులను కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమే అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు.