CM Chandrababu Announced Flood Compensation : కాకినాడ జిల్లా ఏలేరు వరద బాధిత ప్రాంతాల్ని పరిశీలించిన ముఖ్యమంత్రి బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు.హెలీకాఫ్టర్లో మధ్యాహ్నం సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జి.రాగంపేట, వడ్లమూరు, గోరింట, దివిలి, పులిమేరు, చంద్రమాంపల్లి మీదుగా కిర్లంపూడి మండలం రాజుపాలెం చేరుకున్నారు. గ్రామంలో వరద పరిస్థితిని పరిశీలించారు.
ఏలేరు ఆధునికీకరణ పనుల పట్ల నిర్లక్ష్యం : ఏలేరు కాల్వక గండి పడిన స్థలాన్ని స్థానిక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కలెక్టర్ షన్ మోహన్ సీఎంకు చూపించారు. అనంతరం జేసీబీ ఎక్కి ఎస్సీపేటలో వరద నీటిలో పర్యటించారు. మధ్యలో నీటిలో దిగి ఇళ్లు మునిగి అవస్థలు పడుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ప్రసంగించారు. ఏలేరుకు 47 వేల క్యూసెక్కుల రికార్డు వరద రావడంతో 30 వేల క్యూసెక్కుల దిగువకు వదిలారని, లేదంటే జలాశయానికి ప్రమాదం జరిగేదని తెలిపారు.
ఏలేరు వరద ఊళ్లనుముంచెత్తిందని, జగ్గంపేట నియోజకవర్గం బాగా దెబ్బతిందని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లోనూ నష్టం తీవ్రంగా ఉందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏలేరు ఆధునికీకరణ పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. ఏలేరు ఆధునికీకరణ పనులు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఎకరాకు పది వేలు : ఏలేరు వరద, భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసిందని సీఎం వెల్లడించారు. వ్యవసాయానికి టీడీపీ ప్రభుత్వం పెంచిన సాయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తగ్గించిందన్న చంద్రబాబు, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేల రూపాయలు, అలాగే నీట మునిగిన పంటలు తిరిగి కోలుకునేలా ఉంటే ఉచితంగా ఎరువులు అందిస్తామని ప్రకటించారు. ముంపు బాధితులు దుస్తులు, వంటసామాగ్రి కొనుక్కునేందుకు రూ.10వేల ఇస్తామని వెల్లిడించారు.
వరద బాధితులకు గుడ్ న్యూస్ - నష్టం వివరాల నమోదుకు గడువు పొడగింపు - Government Extended Enumeration
భవిష్యత్లో ఓ యాప్ రూపొందిస్తాం : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ దూరంగా పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు నేరుగాముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు చేరేలా భవిష్యత్లో ఓ యాప్ రూపొందిస్తామని, సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం పర్యటనలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చినరాజప్ప, సత్యప్రభ, పంతం నానాజీ, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.