YSRCP Attacks on TDP in Palnadu: ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘర్షణలు, వరస దాడులతో పల్నాడు ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందో లేదో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటామో లేదోననే ఆందోళన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలున్నా పల్నాడులో అధికార వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు, దాడులకు హద్దే లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పోలింగ్ సమయం దగ్గర పడుతున్నా వైఎస్సర్సీపీ ఆగడాలను అదుపు చేయడంలో పోలీసులు, ఎన్నికల యంత్రాంగం విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజవర్గాల్లో తరచుగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు సరైన రీతిలో స్పందించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Does Peaceful Polling Happens in Palnadu Region: పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లలో మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకుడు మోదుగుల నరసింహారావు కారును వైఎస్సార్సీపీ శ్రేణులు తగలబెట్టాయి. ఎన్నికల సందర్భంగా నరసింహారావు కూటమి తరపున ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌గా గతంలో అభివృద్ధి చేసి ఉండటం, సౌమ్యుడుగా పేరుండటంతో నరసింహారావు చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. 5వేల 700ఓట్లు ఉన్న గ్రామం కావడంతో టీడీపీకి మెజారిటీ పెరుగుతుందని అక్కసుతో వైఎస్సార్సీపీ నాయకులు నరసింహారావు కారుకు మంగళవారం వేకువ జామున 3గంటల ప్రాంతంలో నిప్పు పెట్టారని ఆరోపించారు. గ్రామంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.
High Tention in Palnadu Poling: మాచర్లలో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై అధికార వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఐదో తేదీ ఆదివారం సాయంత్రం 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తరఫున కూటమి నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు పార్టీ జెండాలతో వచ్చి అడ్డుకుని కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ వర్గీయుల వైఖరిపై టీడీపీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా పోలీసులు ఘటనాస్థలానికి రాలేదు. మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కేశవ్, వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. మాచర్ల గ్రామీణంలోనూ వైఎస్సార్సీపీ ఆగడాలు హెచ్చుమీరాయి. అలుగురాజుపల్లెలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయులు మధ్య వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందని సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన విజయపురిసౌత్ స్టేషన్ కానిస్టేబుల్ సాంబనాయక్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో సాంబ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు.
నరసరావుపేటలో 6 వార్డు టీడీపీ అధ్యక్షుడు మోహన్‌రావు ఇంటిపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. పెట్రోల్ బాంబులు, రాళ్లు, కర్రలు, రాడ్లతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయగా మోహన్‌రావు సహా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇంట్లోకి చోరబడి ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. చిన్నారులపై కూడా దాడి చేశారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని మోహన్‌రావు ఇంటిపై దాడిచేశారని నేతలు ఆరోపిస్తున్నారు. గురజాల మండలం దైదాలో వైఎస్సార్సీపీకి చెందిన కొంతమంది సోమవారం రాత్రి యాదవ వర్గానికి చెందిన తెలుగుదేశం సానుభూతి పరుల ఇళ్లపై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేశారు. ఆడ, మగ అనే విచక్షణ లేకుండా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తలలకు గాయలయ్యాయి. నూజెండ్ల మండలం రాముడుపాలెంలో వైఎస్సార్సీపీ నేతలు కొట్టె సుబ్బారావు, భీమవరం బాలకొండయ్య టీడీపీ కార్యకర్త ఆకుల వెంకటేష్‌పై సోమవారం కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు.
మరో ఐదు రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికీ పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటంపై సామాన్య ఓటర్లలో భయాందోళనలు వ్యక్తమమవుతున్నాయి. తమకు వ్యతిరేకమని తెలిస్తే చాలు బెదిరింపులకు దిగుతున్న వైఎస్సార్సీపీ వర్గీయులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. అప్పుడు మాత్రమే ఓటింగ్ అనేది సజావుగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.