Chilli Farmers Problems in Telangana : గత ఏడాది సీజన్‌లో వరంగల్, ఖమ్మం మార్కెట్లలో క్వింటాల్ మిరప రూ.25 వేల వరకు పలికింది. ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనూ కనిష్టంగా రూ.14వేలు, గరిష్ఠంగా రూ.20వేల వరకు పలికింది. దీంతో సీజన్ చివరి వరకు ఇవే ధరలు కొనసాగుతాయాని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి. మిరప కోతలు ముగింపు దశకు వస్తున్న వేళ పతనమవుతున్న ధరలు రైతుల్ని కోలుకోనివ్వడంలేదు. ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.8 నుంచి రూ.15 వేలకు మించి రాకపోవడంతో పెట్టిన పెట్టుబడులైనా చేతికి రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌లో సరైన ధరలు లేకపోవడంతో చాలా మంది రైతులు కొన్ని రోజుల తర్వాత ధరలు బాగా వస్తాయన్న ఆశలతో శీతల గిడ్డంగుల్లో మిరప పంట నిల్వ చేయడంతో దాదాపు అన్ని చోట్ల కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయని వ్యాపార వర్గాలు తెలిపాయి.
Chilli Prices Declined Despite In Telangana : ఈ ఏడాది ఖమ్మం, మహబూబాబాద్, గద్వాల్, సూర్యాపేట, వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో 3.25 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. ఈ క్రమంలో ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వరంగల్‌లోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. సీజన్ ప్రారంభంలో రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు బస్తాలు రాగా ఆ తర్వాత నుంచి మార్కెట్‌కు మిర్చి భారీ తరలివస్తోంది.
హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు కూడా పెద్ద ఎత్తున పంట అమ్మకానికి వస్తోంది. వాతావరణ పరిస్థితులు, చీడపీడల బెడద నుంచి తట్టుకుని పండించిన పంట తీసుకువస్తే గిట్టుబాటు కాక ఏం చేయాలో తెలియక రైతులు అల్లాడిపోతున్న సమయంలో తాజాగా రైతులు అమ్మాలా? కోల్డ్ స్టోరేజీలో పెట్టుకోవాలా? అని ఆలోచిస్తున్న వేళ 31,488.63 మెట్రిక్ టన్నుల మిరప కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ గ్రేడ్ - 1 కార్యదర్శి దామోదర్ వెల్లడించారు.
'ఎర్ర బంగారం'తో కిక్కిరిసిన ఎనుమాముల మార్కెట్ - గిట్టుబాటు ధర దక్కట్లేదంటూ అన్నదాతల ఆవేదన
పచ్చళ్ల సీజన్ కావడంతో చిల్లర మార్కెట్లు, సూపర్ మార్కెట్లలోనూ ధరలు ఉంటాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. శీతల గిడ్డంగులు సైతం మిరప పంట నిల్వలతో నిండిపోవడంతో రైతులు మార్కెట్ యార్డులకు పంటను తీసుకొస్తున్నారు. దీని వల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెరిగిపోతున్న పెట్టుబడుల వ్యయం నేపథ్యంలో క్వింటాల్ ధర రూ.25 వేలు పలికితే తప్ప అప్పులబారిన పడకుండా ఉండవచ్చని రైతులు అంటున్నారు.
పడిపోయిన 'మిర్చి' ధరలు - ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు