Children Summer Camp in Kurnool: నేటి తరం పిల్లల్లో చాలామంది ఎప్పుడూ సెల్ ఫోన్లు, టీవీలకే అతుక్కుపోయి కనిపిస్తారు. కానీ ఆ చిన్నారులు మాత్రం తమకు ఇష్టమైన కళలను నేర్చుకుంటూ, ఆనందంగా గడుపుతున్నారు. తమలోని టాలెంట్‌కు మెరుగులు దిద్దుకుంటూ వేసవి శిక్షణా శిబిరాల్లో సందడి చేస్తున్నారు.
కర్నూలు చిన్నారులు వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. సమయాన్ని వృథా చేయకుండా టీజీవీ కళాక్షేత్రం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరంలో తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. శాస్త్రీయ సంగీతం, కూచిపూడి, జానపద నృత్యం, వెస్ట్రన్ డ్యాన్స్, చిత్రలేఖనం తదితర అంశాల్లో మెలుకువలు నేర్చుకుంటున్నారు. తమకు ఇష్టమైన ఆంశాలపై పట్టు సాధిస్తూ, సంతోషంగా గడుపుతున్నారు.
ఏప్రిల్ 25న ప్రారంభమైన వేసవి శిక్షణా శిబిరం మే 29న ముగియనుంది. కర్నూలులోని వివిధ ప్రాంతాలకు చెందిన 150 మంది చిన్నారులు వివిధ అంశాలను నేర్చుకుంటున్నారు. వీరికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవటం, ఉపాధ్యాయులు మరింతగా తీర్చిదిద్దుతుండటంతో చిన్నారులు ఆరితేరుతున్నారు.
చివరి రోజైన మే 29న పిల్లలు నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులు, నగర ప్రజల ముందు టీజీవీ కళాక్షేత్రం వేదికపై ప్రదర్శించనున్నారు. ఈ శిబిరం వల్ల ఎంతో నేర్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. కళలను నేర్చుకోవటమే కాదని.. కొత్తవారు స్నేహితులవుతున్నారని అంటున్నారు. కళలు నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని శిక్షకులు చెప్పారు.
"ఇక్కడ సమ్మర్ క్యాంప్‌లో చాలా మందికి కూచిపూడి నృత్యాన్ని కరీముల్లా సర్ నేర్పిస్తున్నారు. ఇక్కడ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవచ్చు. వేసవి సెలవుల్లో ఇక్కడ నేర్చుకోవడం చాలా మంచిగా అనిపిస్తోంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాము". - విద్యార్థి
"నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను. కొత్తలో కొంచం భయం వేసింది. తర్వాత అలవాటు అయిపోయింది. ఇక్కడ సర్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది అని మా పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేశారు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం". - విద్యార్థి
"మాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది. అదే ఇక్కడకి వచ్చి నేర్చుకుంటే, స్కూల్లో ఏవైనా ఈవెంట్స్‌లలో పార్టిసిపేట్ చేయొచ్చు. అదే ఇంట్లో ఉంటే ఫోన్ గేమ్స్ తప్ప ఏమీ రావు. ఇక్కడ వెస్టర్న్, క్లాసికల్ డ్యాన్స్ అదే విధంగా డ్రాయింగ్, మ్యూజిక్ అన్నీ ఉన్నాయి". - విద్యార్థి
"ఫైన్ ఆర్ట్స్ అనేవి పిల్లల మానసిక ఎదుగుదలకు చాలా అవసరం. పిల్లలు వీటిని నేర్చుకోవడం వలన వారికి భవిష్యత్తులో కూడా మేలు జరుగుతుంది. ఆ సమ్మర్ క్యాంప్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉంది". - రమ్య, విద్యార్థి తల్లి