Child Suffering With Rare Disease Parents Seeking Help From Donors in Konaseema District : ఓ నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. చక్కగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండే తమ చిన్నారికి అంతు చిక్కని వ్యాధి సోకడంతో మంచానికి పరిమితమైంది. వైద్యం చేయించడానికి ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. ప్రభుత్వమో, దాతలో తమను ఆదుకోవాలని ఆవేదనతో వేడుకుంటున్నారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక పంచాయతీ పరిధి తోట్లపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మిక కుటుంబమైన ఆకుమర్తి నాగేంద్ర ప్రసాద్ శాంతకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. 9వ తరగతి చదువుతున్న ఆకుమర్తి జ్యోతికి ఇటీవల కాళ్లపై చిన్న పుండ్లు వచ్చాయి. అవి క్రమేపీ పెరిగి పెద్దవి కావడం గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు స్థానిక డాక్టర్లను సంప్రదించారు.
ఎన్ని మందులు వాడినా తగ్గక పోవడంతో సమీపంలోని పలు ఆసుపత్రులలో చూపించినా వ్యాధి నయం కాకపోగా, ఆ వ్యాధి శరీమంతా వ్యాపించింది. దీంతో చిన్నారి ఆ బాధ తట్టుకులేక కన్నీళ్లు పెడుతుంటే తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. చిన్నారిని పరీక్షించిన ఓ వైద్యుని సూచనతో తనను విజయవాడ రెయిన్బో పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అక్కడ వైద్యపరీక్షల అనంతరం వారానికి రూ.85 వేల విలువైన ఇంజెక్షన్ వేయించాలని, ఇలా పది ఇంజెక్షన్లు చేయాలని, అలా చేస్తూ మందులు వాడితేనే వ్యాధి నయం అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అప్పులు తెచ్చి, కూలి చేసి పొదుపు చేసిన డబ్బు కొంత, బంధువుల సహకారంతో రెండు ఇంజెక్షన్లు చేయించారు. మిగతా ఎనిమిది చేయించే దారి కనపడక మంచానికే పరిమితమైన తమ పాప ప్రాణం నిలుపుకోవడానికి దాతలను, ప్రభుత్వాన్ని సాయం కోరుతున్నారు.
'మా పాపు శరీరం పై పుండ్లు ఏర్పడి బాధపడుతుంది. అవి తగ్గడానికి చాలా ఆస్పత్రుల్లో చికిత్స చేయించాం. మందులు వాడాం. ఆ వ్యాధి నుంచి నా బిడ్డ కోలుకోవడానికి రూ.85 వేల విలువైన ఇంజక్షన్లు పది అందించాలని వైద్యులు చెప్పారు. దాతలు స్పందించి నా బిడ్డ ప్రాణాలు కాపాడండి.' -శాంతకుమారి, పాప తల్లి