Shanti Homam in Tirumala : తిరుమల నెయ్యి కల్తీపై సిట్‌తో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అలాగే అందరి సలహాలతో సోమవారం తిరుమలలో శాంతి హోమం చేస్తామని తెలిపారు. సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు హోమం, పంచగవ్యప్రోక్షణ చేస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు.
అదే విధంగా దేవాదాయ శాఖ తరఫున అన్ని దేవాలయాల్లోనూ హోమాలు చేయటంతో పాటు నాణ్యత ప్రమాణాలు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఐజీ ఆపై స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ వేస్తామన్నారు. సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని తేల్చిచెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఆయా ప్రార్ధనా మందిరాల్లో ఆ మతం వారే బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మతసామరస్యం కాపాడేందుకు అవసరమైతే ఓ ప్రత్యేక చట్టం కూడా తెస్తామన్నారు. ఆగమ శాస్త్ర పండితులు, ఇతర నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీ వేసి సంప్రదాయాలు కాపాడే దిశగా సిఫార్సులు కోరి వాటిని అమలు చేస్తామని ప్రకటించారు. అన్ని దేవాలయాల్లో మహిళల్ని గౌరవించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా కాపాడే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే దేవుడికి అపచారం చేసే ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవస్థలన్నీ చక్కదిద్ది పద్ధతి ప్రకారం పవిత్ర భావంతో మెనేజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తేల్చిచెప్పారు.
TTD EO Shyamala Rao Comments: టీటీడీ వినియోగించే నెయ్యిలో కల్తీతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. దోషాల నివారణకు ఆగస్టు 15 నుంచి 18 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించామన్నారు. ఆవు నెయ్యి కొనుగోలు విధానాల్లో మార్పులు చేశామన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలుకు తగిన చర్యలు తీసుకొన్నామని తెలిపారు. ప్రస్తుతం రూ.475కు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నందిని, ఆల్ఫా ఫుడ్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేశామని, మూడు నెలల్లో సెన్సరీ ల్యాబ్‌ను కూడా పెట్టినట్లు స్పష్టం చేశారు. నెయ్యి స్వచ్ఛత పరీక్షలో నిపుణులను ప్యానల్‌లో నియమిస్తామన్నారు.
భక్తుల ఆందోళన దృష్ట్యా మరిన్ని కార్యక్రమాలు: ఎన్‌డీడీబీ వాళ్లు టెస్టింగ్ కిట్‌ను విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారని, తిరుమలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ లేదా జనవరిలోగా టెస్టింగ్ పరికరాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నాణ్యమైన నెయ్యి వాడకంతో లడ్డూలో నాణ్యత పెరిగిందని, అన్నప్రసాదం, లడ్డూ పోటులో కూడా పవిత్రాల సమర్పణ జరిగిందన్నారు. తద్వారా కల్తీ నెయ్యితో వచ్చిన దోషం తొలగిపోయిందన్నారు. భక్తుల ఆందోళన దృష్ట్యా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 6 నుంచి 10 వరకు తిరుమలలో శాంతి హోమం నిర్వహిస్తామని వెల్లడించారు. లడ్డూ అపవిత్రంపై ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఈవో, నెయ్యిలో కల్తీ ఉందని నివేదికలో తేలిందన్నారు. ఎన్‌డీడీబీ ల్యాబ్ సహకారంతోనే పరికరాలు తీసుకువస్తున్నామని, ప్రస్తుతం తీసుకుంటున్న నెయ్యితో ప్రసాదాలు తయారీ చేస్తున్నామన్నారు.