Cheruvugattu Jatara 2024 : నమ్మిన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నప్రముఖ శైవ క్షేత్రమైన చెర్వు గట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈనెల 21 వరకు జరిగే జాతరకు జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ గోపురాలు, చుట్టు పక్కల ఉన్న శివుడు, గణపతి విగ్రహాలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు.
నల్గొండ జిల్లా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సాయంత్రం 4 గంటలకు నల్గొండలోని రామాలయం నుంచి నగరోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17 తేదీ ఉదయం 4 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 18న ఆదివారం స్వామి వారి అగ్నిగుండాలు, 19న దీపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. 20న మహా పూర్ణాహుతి, పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. 21న సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేస్తారు.
సమ్మక్క- సారలమ్మ ప్రసాదం భక్తుల దగ్గరకే - టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్
Nalgonda Cheruvugattu Jatara 2024 : పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. బ్రహ్మోత్సవాలకు సుమారు 3 లక్షల మంది వరకు భక్తులు రానున్నారని అంచనా వేశారు. ఇప్పటికే ఘాట్ రోడ్డు వద్ద, గుట్ట కింద రద్దీ ఉన్న ప్రదేశాల్లో దుకాణాలను తొలగించారు. పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. గుట్ట పైకి వృద్ధులు, చిన్న పిల్లలను తీసుకొని వెళ్లేందుకు ఆటోలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ (CCTV) కెమెరాల దృశ్యాలను చూసేందుకు 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. నీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రవాణా తదితర వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు.
"పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశాము. వృద్దులు, చిన్న పిల్లల కోసం ఆటోలను ఏర్పాట్లు చేసాం. భక్తులకు నీటి వసతి, ప్రసాదం పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసాము. పలు జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసాం." -వేముల వీరేశం, నకిరేకల్ ఎమ్మెల్యే
జాతరకు వచ్చే భక్తుల కోసం నార్కట్‌పల్లి, నల్గొండ, యాదగిరి గుట్ట, సూర్యాపేట, దేవరకొండ, కోదాడ డిపోల నుంచి ప్రత్యేక బస్తులను నడుపనున్నారు. జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రవాణా తదితర వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను అదేశించారు. స్వామి వారి కల్యాణం, తలంబ్రాల బియ్యం సేకరణలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.