Cheating Case on Harish Rao Relatives : తమకు చెందిన ఐదంతస్తుల భవనంలో మాజీ మంత్రి హరీశ్‌రావు బంధువులు అక్రమంగా వచ్చి ఉంటున్నారని, తమకు తెలియకుండానే తమ ఆస్తిని అమ్మేశారని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో జే.చిట్టిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన మిత్రుడు దండు లచ్చిరాజుకు సంబంధించిన ఐదంతస్తుల భవనంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజ్‌కుమార్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావులపై ట్రెస్‌పాస్, ఛీటింగ్ కేసు నమోదైంది.
2019 నుంచి పలుమార్లు ఫిర్యాదు : వీరితో పాటు ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీస్, మియాపూర్‌లోని ఫిట్జీ లిమిటెడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దండు లచ్చిరాజుకు చెందిన భవనాన్ని ఆక్రమించి దానిని హరీశ్‌రావు బంధువులు వాడుకున్నారని, వారికి తెలియకుండా వారి ఆస్తిని విక్రయించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా బోయినపల్లి వెంకటేశ్వర రావు నడుపుతున్న ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ట్రెస్‌పాస్ బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటుతో ఛీటింగ్‌కు పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదులో వివరించారు. అలాగే జంపన ప్రభావతి తమకు వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారని ఆరోపించారు. 2019 నుంచి ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా నిందితులపై చర్యలు తీసుకోలేదని, ఈసారైనా న్యాయం చేయాలని బాధితుడు పేర్కొన్నారు.