Chandrababu Slams CM YS Jagan: దేశంలో రాబోయేది ఎన్డీయేనే, కాబోయే ప్రధాని మోదీయే అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించడానికి అందరూ సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్రమంత్రి అమిత్ షాతో పాటుగా నిర్వహించిన భహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతిని నాశనం చేసిన జగన్‌ను ఇంటికి పంపాల్సిన సమయం అసన్నమైందన్నారు. మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టంగా చెప్పారన్న చంద్రబాబు, మన ఆశలను సైకో జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని, అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పోలవరంపై అమిత్‌షా నిర్దిష్ట హామీ ఇచ్చారని తెలిపారు.
ప్రాజెక్టులను జగన్ అటకెక్కించారు: పోలవరంపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పోలవరం పూర్తిచేసి, హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ రాయలసీమ ద్రోహి, ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని, సాగునీటి ప్రాజెక్టులను జగన్ అటకెక్కించారని విమర్శించారు. గోదావరి మిగులు జలాలను చివరి భూములకూ అందిస్తామన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారన్న చంద్రబాబు, కేంద్రం ఇచ్చిన డబ్బులివ్వకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి రైతుకు రూ.20 వేలకంటే పైగానే మీ ఖాతాల్లో వేస్తామన్నారు. రైతును రాజుగా చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బిందు, తుంపర సేద్యం తీసుకొస్తామని పేర్కొన్నారు.
అడవిలా మారిన అమరావతి ప్లాట్లు - కోర్టులు, అన్నదాతలను మోసం చేస్తున్న సర్కార్ - ysrcp govt negligence on amaravati
యువతకు ఉపాధి కల్పిస్తాం: సమర్థ నాయకత్వం ఉండి కేంద్ర సహకారం తీసుకుంటే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఏటా 4 లక్షలు చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. లేదా, ఉద్యోగం వచ్చేవరకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
ఉచిత ఇసుక విధానం తెస్తాం: గత ఎన్నికల్లో కోడికత్తి, ఇప్పుడేమో గులకరాయి దాడి నాటకాలు అడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటమి ఖాయమని ముందే తెలుసని, ఓడిపోతానని తెలిసే జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. మేం ఉచిత ఇసుక ఇస్తే, ఇవాళ దొరికే పరిస్థితి లేకుండా చేశారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానం తెస్తామన్నారు. గతంలో లేపాక్షి భూములు కొట్టేయాలని చూశారు, ఇప్పుటు మన భూములపై హక్కు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మీ పాస్‌పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చట్టం తెచ్చి భూములు కాజేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.