Chandrababu Prajagalam Public Meeting: రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, వైసీపీ ఫ్యాన్ ముక్కలు కావడం ఖాయమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ దళిత, గిరిజన ద్రోహి.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసిన వారిని కాటేసే జలగ జగన్ అంటూ ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 60 శాతం సబ్సిడీతో ట్రైకార్ రుణాలిచ్చేవాళ్లమని, ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. గిరి గోరుముద్దల పథకం తీసుకొచ్చి బాలింతలను ఆదుకున్నామని తెలిపారు. ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్‌ను దోచుకున్నారని ఆరోపించారు. జీవో నెం.3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. జీవో నెం.3ని రద్దుచేసిన వ్యక్తికి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే మళ్లీ జీవో నెం.3 తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని దుయ్యబట్టారు.
నవరత్నాలు - నవమోసాలన్న చంద్రబాబు, తాము సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలు పెంచేశారని మండిపడ్డారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేవని, మద్యం డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు పోతున్నాయన్నారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చేవరకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందన్నారు.
ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు- రాష్ట్రంలో పథకాలపై ఈసీ నిర్ణయం - EC on schemes funds release in AP
ఆడబిడ్డలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, అన్నదాతకు రూ.20 వేలు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు. బటన్ నొక్కి ఎంత బొక్కాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. బటన్ నొక్కేది రూ.10, బొక్కేసిన డబ్బు రూ.1000 అని చంద్రబాబు ఆరోపించారు. బటన్ నొక్కితే ఈసీ ఒప్పుకోలేదని నాటకాలాడుతున్నారని, బటన్ నొక్కితే 24 గంటల్లో డబ్బులు రావాలి కదా? అని ప్రశ్నించారు. జనవరిలో బటన్ నొక్కితే పేదవారికి డబ్బులు ఎందుకు అందలేదో చెప్పాలన్నారు. ఆయన నొక్కిన బటన్ పేదవాడికి కాదు, దళారుల కోసం అంటూ మండిపడ్డారు.
మీ పాస్ పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు వేశారో ప్రశ్నించాలని చంద్రబాబు సూచించారు. మీరు సంపాదించుకున్న భూమిపై జగన్‌కు హక్కు ఉందా? అని ప్రశ్నించారు. జగనన్న భూహక్కు పథకం ప్రతిని చించివేసిన చంద్రబాబు, మన భూములపై జగన్‌కు హక్కు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా వాళ్ల అనుమతి కావాలటా?, అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపైనే రెండో సంతకం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరిన సీఎం జగన్ - ఈ నెల 14న తీర్పు - YS JAGAN FOREIGN TOUR