PM Midi Pays Tributes to NTR : దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ గొప్ప స్ఫూర్తి అని, దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సేవలు మరువలేనివని పెర్కోన్నారు. వెండితెరపై ఎన్నో మరపురాని పాత్రల్లో నటించి మెప్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Chandrababu Naidu Pays Tributes to NTR : రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
నట విశ్వరూపం, తెలుగుజాతి ఆత్మగౌరవం.. జయహో 'ఎన్టీఆర్'
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు కొనియాడారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారని అన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని చంద్రబాబు అన్నారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పని చేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారని వెల్లడించారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని సూచించారు.
మోదీకి చంద్రబాబు ట్వీట్ : ఎన్టీఆర్ ఆశయ సాధనకు, సమాజం కోసం కలిసి పని చేద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని చేసిన ట్వీట్‌కు చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండేనని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణలో ఎన్టీఆర్ పోరాటం మనందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అందించిన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి అందరి హృదయాల్లో ప్రకాశిస్తోందని చంద్రబాబు తెలిపారు.
ఎన్టీఆర్ జయంతి.. పవన్ కల్యాణ్ ఏమన్నారో తెలుసా?
ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోయాయి : సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో మన ఎన్టీఆర్ ఒకరని తెలుగువారు గర్వంగా చెప్పుకోవచ్చని, అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు, రూ.2కే కిలో బియ్యం చిరస్థాయిగా నిలిచిపోయాయని జనసేన పార్టీ అధికారిక ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
ఎన్టీఆర్‌కు 'భారతరత్న' పురస్కారంతోనే సముచిత గౌరవం : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి నివాళులర్పించారు. ఆయన కీర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "కొందరి కీర్తి అజరామరం భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలకు 'భారతరత్న' పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నాను. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.
నారా లోకేశ్ నివాళులు : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్ అని, అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని తాతయ్య నందమూరి తారక రామారావు గారే తన నిత్యస్ఫూర్తి అని పేర్కొన్నారు.
NTR Birthday : కారణజన్ముడు.. తారకరాముడు.. ఆయనకు మాత్రమే సాధ్యమైన ఘనతిది!
ఎన్టీఆర్ ఘాట్‌లో బాలకృష్ణ : విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకొని కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో బాలకృష్ణ అంజలి ఘటించారు. విద్యకు పెద్దపీట వేసిన వ్యక్తి అని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని, నటనకు విశ్వవిద్యాలయమని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకొని అంచెలంచెలుగా ఎదిగారని బాలయ్య గుర్తు చేశారు.
అంజలి ఘటించిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర : హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురందేశ్వరి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక పేరు, ఒక వ్యక్తి కాదు ఒక సంచలనమని పురందేశ్వరి తెలిపారు. చిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా నటించారని, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు తెచ్చారని గుర్తు చేశారు.
Venkaiah Naidu Tribute to NTR : తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నివాళు లర్పించారు. చలన చిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజానీకాన్ని మెప్పించారని కొనియాడారు. ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్న రామారావు రాజకీయాల్లోనూ నవ శకానికి నాంది పలికి దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని ప్రశంసించారు. గొప్ప జాతీయ వాది అయిన రామారావు నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు అంకురార్పణ చేసి, మార్గదర్శిగా నిలిచి మహానేతగా మన్ననలు అందుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు, అధికార వికేంద్రీకరణ సహా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప సంస్కరణవాది నందమూరి తారక రామారావు అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్.. కెరీర్లోనే ఎక్కువ టేకులు తీసుకున్న సినిమా ఏంటంటే?