Chandrababu Naidu Letter to CS and EC: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్దిదారులకు నగదు రూపంలో పెన్షన్ మొత్తం చెల్లించాలన్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలని డిమాండ్ చేశారు. దీని కోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లడానికి అనుమతించాలని, అసవరమైన అనుమతులు ఇవ్వాలని సూచించారు.
పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదనే వార్తలు వస్తున్నాయని, నిధులు వెంటనే అందుబాటులో ఉంచాలని కోరారు. గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5 తేదీ మధ్యనే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరారు.
Devineni Uma About Pensions Distribution: సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీకి ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఇచ్చేది గోరంత, ప్రచారం కొండంత అని మండిపడ్డారు. ఏప్రిల్ 1వ తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందించాలని, లేకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పెన్షన్ డబ్బు బినామీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టే అధికారం జగన్ రెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. దేశంలోనే తొలిసారిగా పెన్షన్ విధానం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అని, 200 రూపాయల పెన్షన్ను 2 వేలకి, ఆపై 3000 చేసింది చంద్రబాబే అని గుర్తుచేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్ 4000 అందిస్తామని స్పష్టం చేశారు.
EC on AP Pensions Distribution: కాగా పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని ఎన్నికల ప్రధాన అధికారిని ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కోడ్ ముగిసేవరకు వాలంటీర్ల ట్యాబ్, మెుబైల్‌ను సైతం కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలంటూ ఆదేశించింది.
రాజకీయ లబ్ధి కోసమే ఈసీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం: అనగాని - Anagani on Pension Distribution