Chandrababu Naidu interacts with women: శ్రీకాకుళంలో మహిళలతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్థలం లేని పేదలకు 2, 3 సెంట్లు భూమి ఇప్పించి ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పేదవాళ్లందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రూ.4 వేలు పింఛన్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.
వికలాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పింఛన్లన్నీ ఇంటివద్దే ఒకటవ తేదీనే ఇచ్చేలా ఏర్పాట్లు చెేస్తామన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనేది లక్ష్యం కావాలన్నారు. యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అమ్మకు వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని వెల్లడించారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యమన్నారు. జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబానికి భవిష్యత్తు గ్యారెంటీ ఉంటుందని పేర్కొన్నారు.
తాను మొదటి నుంచి మహిళాపక్షపాతినని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు పుట్టినిల్లు అని, మీ కుటుంబాలకు పెద్దకొడుకులా సేవచేస్తానని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారని ఆరోపించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్ అని ఎద్దేవా చేశారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెంచేశారని మండిపడ్డారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.
ఎన్నికలకు నేటి నుంచి ఇంకా 19 రోజులు మాత్రమే ఉందని, మే 13న వైసీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఓటుతో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. అసమర్థ, చేతగాని ప్రభుత్వంతో అన్నీ ఇబ్బందులే అని ఎద్దేవా చేశారు. సమర్థ ప్రభుత్వం ఉంటేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు.
మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించింది టీడీపీ - చంద్రబాబు - Chandrababu Interact with Women
కూన రవికుమార్: వేసవిలో చంద్రబాబు ఉపాధి హామీ కూలీ 40శాతం అదనంగా ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు. కానీ, సీఎం జనగ్ ఉపాధి హామీ కూలీ సొమ్ముల్లోనూ వాటాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జగన్ ఇచ్చేదాని కంటే నొక్కేసేదే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే జగన్ మద్యపాన నిషేధం చేస్తానన్నారని, నిషేధం అమలు చేశాడా? అని ప్రశ్నించారు.
రామ్మోహన్ నాయుడు: వైసీపీలో అత్యధికంగా నష్టపోయింది మహిళలే, అని టీడీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా మహిళలకు అండగా చంద్రబాబు నిలిచారన్నారు. దేశంలో మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చారని, చంద్రబాబు కట్టిన ఇళ్లను కూడా జగన్ ప్రజలకు అందించలేకపోయారని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు.