Chandrababu Letter to Election Commission : కేేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరించి అవ్వ తాతలను జగన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కేవలం రాజకీయ లబ్ధికోసం అమాయకులైన పండుటాకులను కీలుబొమ్మలుగా చేశారు. జగన్ రెడ్డి ఆడిన రాజకీయ క్రీడాలో 33 మంది పింఛన్ దారులు చనిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లేఖలో చంద్రబాబు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పింఛన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ
ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోని లబ్ధిదారులకు పింఛన్ పంపిణి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని సెర్ప్ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. దీని వల్ల తీవ్రమైన ఇబ్బందులను తలెత్తుతాయని గమనించి ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్వయంగా ఫోన్ చేయడమేగాక లేఖను సైతం రాశానని చంద్రబాబు తెలిపారు.
రాజకీయంగా లబ్ది కోసమే పింఛన్ దారులకు ఇబ్బందులు : ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయాల్లో 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. వీరందరిని ఉపయోగించుకొని లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయవచ్చు. కాని అలా చేయకుండా టీడీపీని దోషిగా చేసి రాజకీయంగా లబ్ది పొందేందుకు పెన్షనర్లను 40 డిగ్రీల ఎండలో సచివాలయాలకు పిలిపించారు. కనీసం సచివాలయాల వద్ద షామియానాలు, తాగునీరు తదితర సౌకర్యాలు కూడా కల్పించలేదు. సచివాలయానికి వచ్చే లబ్దిదారుల కోసం తగిన వసతులు ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సర్క్యులర్ జారీ చేసినప్పటికి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.
తనపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ డీజీపీకి చంద్రబాబు లేఖ
దీని ఫలితంగా దాదాపు 60 లక్షల మంది పింఛనుదారులు తీవ్రమైన ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు. సచివాలయాల వద్ద నగదు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు పింఛను పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చారు. సచివాలయాల వద్ద పడిగాపులు కాయలేక, ఎండ తీవ్రతకు తట్టుకోలేక వడదెబ్బకు గురై 33 మంది పింఛనుదారులు మరణించారు.
జగన్ రెడ్డి ఆడిన రాజకీయ క్రీడాలో 33 మంది బలి : ప్రభుత్వం ఇంటికి వెళ్లి పెన్షన్ అందించి ఉంటే ఈ 33 మంది వృద్ధుల ప్రాణాలు పోయేవి కావని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి ఇంటివద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వాలని సూచనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో విఫలం అయ్యింది. ఇదంతా కావాలనే కుట్రపూరితంగానే జరిగిందన్నారు. కావున పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
అధేవిధంగా పింఛన్ దారులకు సకాలంలో నిధులు, సరైన సౌకర్యాలు అందించనందుకు సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛను అందించేలా ఆదేశాలు ఇవ్వలని సూచించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, 33 మంది మరణానికి కారణమైన అధికార పార్టీ నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పెన్షన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేస్తున్న విష ప్రచారంపైనా చర్యలు తీసుకోండి చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.