Chandrababu fired at YCP: గుంటూరు మహిళ తన వేలు కోసుకున్నారన్న వార్త కలిచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. గుంటూరు మహిళ తన వేలు కోసుకున్నారన్న వార్త కలిచివేసిందన్నారు. ఆ మహిళ జగన్ అరాచక పాలనను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని తెలిపారు. వేళ్లు కోసుకోవడం కాదు, అదే వేలితో బటన్ నొక్కి ఓటు అనే ఆయుధంతో దుర్మార్గ పాలనపై వేటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
దుకాణాల్లో మాత్రం ఆన్‌లైన్ పేమెంట్స్ ఉండవు: కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్‌లైన్ పేమెంట్స్ ఉండవని విమర్శలు గుప్పించారు. చిన్న టీ కొట్టులోనూ ఆన్‌లైన్ పేమెంట్ చేస్తుంటే, మద్యం దుకాణాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న సీఎం జగన్ ఆడిన మాట నిలబెట్టుకున్నారా?అని ప్రశ్నించారు.
గతంలో ఇంతలా కరెంట్ ఛార్జీలు పెరగలేదు: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీపీఎస్ రద్దు చేస్తామని అన్నారు, చేశారా? అని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డీఎస్సీ వేస్తామని వేశారా? అంటూ ఎద్దేవా చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరెంట్ ఛార్జీలు పెరగలేదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డీఎస్సీ పైనే ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రైతును రాజుగా చేసే బాధ్యత: అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేసినట్లు తెలిపారు. మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నరు. రైతును రాజుగా చేసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ వచ్చి రూ.4 వేలు పింఛను ఇస్తామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో అద్భుతమైన టిడ్కో ఇళ్లు కట్టామని గుర్తుచేశారు. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తామన్నారు.
లెక్కలు వేసుకొని ఓటు వేయాలి: రాష్ట్ర వ్యాప్తంగా మూలపడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా కృషి చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. యువతకు ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరివల్ల బాగుంటామో ప్రజలంతా లెక్కలు వేసుకొని ఓటు వేయాలని చంద్రబాబు సూచించారు.