Chandrababu and Lokesh Responded on Land Titling Act in 'X' : స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ ఆ తరాల మధ్య ప్రేమలను జగన్ పట్టించుకోడని విమర్శించారు. అందుకే చెల్లెళ్లను దూరంగా పెట్టాడని దుయ్యబట్టారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమైనదో, దీనికి ఎంతమంది బలయ్యారో తెలుపుతూ 'ఎక్స్'లో ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టం చేశారు.
భూహక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది ? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసింది ?
అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూమి, మీ ఇల్లు మీది కాదని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేసారు. జనం ఆస్తులు దోచుకునేందుకు జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించే ఓ షార్ట్ ఫిలింను లోకేష్ తన 'ఎక్స్'లో వీడియో పోస్ట్ చేసారు.
Land Titling Act in Andhra Pradesh : ఇంటి స్థలమైనా, పంట పొలమైనా భూమి అంటే ఒక భరోసా. అవసరానికి పనికొస్తుందనే ధైర్యం. భూమినే నమ్ముకున్న రైతు అడుగు నేలనూ ప్రాణంగా భావిస్తారు. అలాంటి మట్టిమనిషి పొలంలో ఐదు సెంట్లు, అరెకరం తగ్గిందంటే తట్టుకోగలరా? వారికేమైనా వైఎస్సార్సీపీ నేతల్లా వందల ఎకరాల ఎస్టేట్‌లున్నాయా, నగరానికో ప్యాలెస్‌లున్నాయా? ఉన్నదే ఎకరం అందులోనూ దోచేస్తామంటే బతికేదెలా? అయినా సీఎం జగన్ మాత్రం రీ సర్వే, జిరాక్స్ పత్రాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అన్నదాతల నమ్మకాలతో ఆడుకుంటున్నారు. వారసత్వపు హక్కుల్నే హరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నా, మీ భూమి మీది కాదనే పరిస్థితి తెచ్చినా ప్రశ్నించకూడదా? పైపెచ్చు కేసులు పెడతామని బెదిరిస్తారా? అని రైతులు నిలదీస్తున్నారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: న్యాయవాదులు
సమగ్ర రీ సర్వే అంటే జగన్ బొమ్మలు, సరిహద్దు రాళ్లే వాటి కోసమే వందల కోట్లు పోసినట్లు పరిస్థితి తయారైంది. వాస్తవానికి సమగ్ర రీసర్వే అంటే రైతుల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేలా ఉండాలి. భూదస్త్రాల స్వచ్ఛీకరణ జరగాలి. కొలతల్లోనూ కచ్చితత్వం అవసరం. వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టిన రీసర్వే కుటుంబాల్లో కొత్త సమస్యలను సృష్టిస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టేలా తయారైంది. 2020లో సమగ్ర రీ సర్వే ప్రారంభిస్తే ఇప్పటికి 6వేల గ్రామాల్లోనే పూర్తయింది. నాలుగు గట్ల మధ్య కొలతలేసి అదే సమగ్ర సర్వే అని లెక్కలు రాసి పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. కొలతల్లో తేడాలొస్తే చర్చించి తమ దగ్గరుండే దస్త్రాలతో ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపే చర్యల్లేవు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వస్తే సామాన్య రైతుల పరిస్థితిని ఊహించలేం. వారి సమస్యలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. నేతలు భూమిని గుంజుకుంటున్నా మౌనంగా భరించాల్సిందే. ఇప్పుడే ఆ చట్టం పేరు చెప్పి చాలాచోట్ల అధికారులు రైతుల్ని బెదిరిస్తున్నారు. రెండుమూడు సెంట్ల తేడా సృష్టించేదీ వారే. నీదైతే రుజువు చేసుకోవాలని చెప్పేదీ వారే. ప్రభుత్వమే నియమించే టైటిలింగ్ అధికారికి అప్పీలు చేసినా న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో భూముల యజమానుల్లో చాలామంది ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్నారు. ఆ భూమి పరిస్థితేంటో కూడా వారికి తెలియదు. వాటి రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు తమ దగ్గరున్నాయనే ధీమాలో ఉంటారు. రాబోయే రోజుల్లో రాత్రికి రాత్రే పేర్లు మార్చుకున్నా వారికి తెలియదు. తర్వాత ఎప్పటికో తెలుసుకున్నా అప్పటికే భూబదలాయింపు జరిగిపోతుంది. కొత్త హక్కుదారులు వస్తారు. తర్వాత హైకోర్టుకు వెళ్లినా పరిష్కారమయ్యేనాటికి తరాలే మారిపోతాయి.
'ఆస్తి హక్కును హరించే చట్టమిది'- ల్యాండ్ టైటిలింగ్‌తో ఎవరికి మేలో చెప్పండి జగనన్న!