Chandrababu and Lokesh on Family Suicide Incident in Kadapa District: వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి చేనేత కుటుంబం బలైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రెవెన్యూ సిబ్బంది ద్వారా వైసీపీ నాయకులు చేసిన అధికారిక భూ కబ్జా నిండు కుటుంబం ఉసురు తీసిందని వాపోయారు. రికార్డుల్లో పేర్లు మార్చిన వైసీపీ భూ బకాసురులతో పోరాడలేక పేద బీసీ కుటుంబం బలవంతంగా ప్రాణాలు తీసుకుందన్నారు. మాటలకు అందని ఈ విషాధం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ఆందోళనలో పడేస్తోందని చంద్రబాబు ఆక్షేపించారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరంలో చోటు చేసుకున్న ఈ దారుణంపై ఏ సమాధానం చెపుతావు జగన్ అని ప్రశ్నించారు. ఎంత కష్టం, ఎంత ఆవేదన, ఎంత క్షోభ ఉంటే ఓ నిండు కుటుంబం ఇలా ప్రాణాలు తీసుకుంటుందో వైసీపీ కబ్జాకోరులకు తెలుసా అని నిలదీశారు. సొంత జిల్లాలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటనపై జగన్ రెడ్డి తక్షణమే స్పందించి, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎక్కడ గంజాయి కేసులైనా మూలాలు ఏపీలోనే: ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయన్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఏ గంజాయి కేసులైనా మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండటం జగన్ రెడ్డి పాలనా దౌర్భాగ్యమని మండిపడ్డారు. నిన్ననే 25,000 కిలోల డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడ్డాయి. రాష్ట్రాన్ని ఇలా అభాసుపాలు చేసిన జగన్ గ్యాంగ్ పాపాలకు ప్రజలే శిక్ష విధిస్తారని వెల్లడించారు. నాడు అభివృద్దిలో దేశంలో వెలిగిన మన రాష్ట్రం నేడు గంజాయితో చీకట్లలోకి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు.
ఎంపీ కృష్ణదేవరాయలు పేరిట వైఎస్సార్సీపీ ట్వీట్- ఈసీకి ఫిర్యాదు - TDP Leaders on Visakha drug case
ముమ్మూటికీ జగన్ సర్కారు హత్యే: తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేయడంతో చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇది ముమ్మూటికీ జగన్ సర్కారు చేసిన హత్యేనని అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, భార్య పద్మావతి, కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాధవరం గ్రామంలో హైవేకి అనుకొని ఉన్న సుబ్బారావుకి చెందిన 3 ఎకరాల భూమిని కబ్జాచేసిన వైసీపీ నాయకులు తమ పిల్లల పేరుతో ఆన్ లైన్‌లో రికార్డులు మార్పించేశారని ఆరోపించారు.
ప్రైవేటు భూముల్లోనూ మట్టి తన్నుకుపోతున్న వైసీపీ గద్దలు- ప్రశ్నిస్తే బెదిరింపులు - Gravel mining
తనకు జరిగిన అన్యాయంపై పోరాడిన సుబ్బారావుని వైసీపీ నేతలు నానా హింసలు పెట్టడంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో వైసీపీ నేతల అకృత్యాలకు పరాకాష్టగా నిలిచిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంత జిల్లా కడపలో నందం సుబ్బయ్య అనే పద్మశాలీ నేతను అత్యంత దారుణంగా చంపేసిన వైసీపీ నేతలు మరో పద్మశాలీ కుటుంబాన్ని బలి తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలపై జగన్ అండతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న మూకలను చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని లోకేశ్ హెచ్చరించారు. వైసీపీ సర్కారు వెనకబడిన తరగతులపై సాగిస్తున్న దమనకాండ చూశాక, బడుగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని గుర్తించి బీసీల రక్షణ కోసం ప్రత్యేకచట్టం తీసుకురావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.