CFD on Elections and Volunteers: ఎన్నికల వేళ ఈసీ ఇచ్చిన ఆదేశాలు శిరోధార్యం అని సీఎఫ్‌డీ (Citizens for Democracy) కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ (Nimmagadda Ramesh Kumar) తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా మాత్రమే ఉంచారన్న నిమ్మగడ్డ, రాజీనామా చేసిన వారిని మళ్లీ తీసుకుంటామనడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని మండిపడ్డారు. వాలంటీర్లు బూత్‌ల్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఈసీకి చెప్పామని అన్నారు. వాలంటీర్లపై తమకు సానుభూతి ఉందని, రద్దు చేయాలని తాము కోరలేదని స్పష్టం చేశారు.
వాలంటీర్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్న నిమ్మగడ్డ, అధికార, ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగవద్దని వాలంటీర్లను కోరుతున్నామన్నారు. వాలంటీర్లను ప్రధాన సమస్యగా సృష్టించడాన్ని సీఎఫ్‌డీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరుతున్నాయని, ఒక్కొక్కరిపై సుమారు రూ.2 లక్షల అప్పు ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారులు ప్రజా సేవకులు అని, ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నారని, అటువంటి వారు రాజకీయ చర్చలో పాల్గొనకూడదని అన్నారు. సమయం, సందర్భం మేరకు కచ్చితంగా ఉండాలని సీఈవోను కోరామని చెప్పారు. ఎన్నికల వేళ స్వతంత్రంగా పనిచేసే ధైర్యం ఎన్నికల సంఘం అధికారులకు ఉండాలని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారుల కార్యాచరణ ద్వారా ప్రజలకు నమ్మకం కలిగించాలని కోరుతున్నామని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.
పింఛన్ల పంపిణీని కావాలనే ఆలస్యం చేశారు - సీఈవోకు సీఎఫ్‌డీ ఫిర్యాదు - CFD Complaint on Pensions Delay
LV Subramanyam Comments: ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన అవకాశాలు దక్కడమని, పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (Citizens for Democracy) సంస్థ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎస్ ఎల్.వి. సుబ్రమణ్యం అన్నారు. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించిందన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల సమయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలే శిరోధార్యం అని స్పష్టం చేశారు.
పింఛను పంపిణీ విషయాన్ని అధికార, ప్రతిపక్షాలు పరస్పరం నిందించుకుంటున్నారన్న ఎల్వీ, వైసీపీలో కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎఫ్‌డీని విమర్శించడం శోచనీయమని, ఈ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ ఆలస్యం చేశారని, పింఛన్లు తీసుకునే వృద్ధులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మే నెల పింఛన్లకు స్పష్టమైన కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నామన్నారు. వేసవి మండుటెండల్లో వృద్ధులను ఇబ్బంది పెట్టడం సరికాదని, పింఛన్ల పంపిణీలో వచ్చే నెల ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నామని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.