CEO Mukesh Kumar Meena: ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని, క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చామన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
రీపోల్‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. రేపు ఫిర్యాదులపై ఆర్‌వోలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారని వెల్లడించారు. పార్టీల నాయకులతో ఆర్‌వోలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారన్నారు. తంగెడలో బాంబు దాడి ఘటనపై మా దృష్టికి వచ్చిందని మీనా పేర్కొన్నారు. తంగెడలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. పోలింగ్ జాప్యం జరగడానికి అవకాశం లేదన్నారు. సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ జాప్యం కావచ్చని సీఈవో వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని, అయితే, ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని మీనా తెలిపారు. 275 బీయూలకు సంబంధించి సమస్యలు వచ్చాయన్నారు. 217 సీయూలకు సంబంధించి సమస్యలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని మీనా స్పష్టం చేశారు. 600 వీవీ ప్యాట్‌లకు సంబంధించి సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 20 వేల యంత్రాలు అధికంగా ఉంచినట్లు తెలిపారు. గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు తక్కువ మంది ఓటర్లే వచ్చారని పేర్కొన్నారు.
పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతాయని తమకు ముందే సమాచారం ఉందని మీనా పేర్కొన్నారు. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై సమాచారం ఉదని, హింసాత్మక ఘటనలు జరిగే చోట్ల ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందిందని, మాచర్ల కేంద్రంలో ఈవీఎం యంత్రాలు దెబ్బతిన్నాయని మీనా పేర్కొన్నారు. ఇంజినీర్లు యంత్రాలు పరిశీలించి డేటా వస్తుందని చెప్పారని ఈసీ తెలిపారు. మాచర్లలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ముగిసిన పోలింగ్ - సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ - POLL PERCENTAGE
కోడూరులో 2 ఈవీఎంలు దెబ్బతిన్నాయని మీనా తెలిపారు. దర్శిలో 2 చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నాయని, మాచర్ల, తెనాలి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు మీనా తెలిపారు. పలుచోట్ల సాయంత్రం 6 తర్వాత క్యూలో ఉన్నవారు ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. 300 మందికిపైగా క్యూలో ఉన్న చోట్ల రాత్రి 10 వరకు పోలింగ్ జరగవచ్చని సీఈవో అంచనా వేశారు. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ జరిగిందన్నారు. తుది పోలింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తామని సీఈవో తెలిపారు.