CEO Mukesh Kumar Instructions to Hoardings Banners : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగినప్పటినుంచి ఎన్నికల కమిషన్ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల నియమావళిపై రాజకీయ పార్టీలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్న కమిషన్ తాజాగా కొన్ని జత చేసింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాజకీయ పార్టీలు వారి కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్‌లు, బ్యానర్లను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయా కార్యాలయాల్లో వాటిని శాశ్వత ప్రాతిపదికన అనుమతులతో ఏర్పాటు చేసినందున తొలగించాల్సిన అవసరం లేదని అధికారులకు సూచనలు చేశారు. ఈమేరకు సచివాలయం నుంచి జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలన్న ఈసీ నిబంధనపై ప్రధాన పార్టీల అభ్యంతరం!
మరోవైపు రాజకీయ పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో కేవలం 4 నుంచి 8 అడుగుల ఉన్న బ్యానర్లు అలాగే ఒక్క జెండాకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇంటింటి ప్రచారానికి అనుమతి జారీ చేసే అంశంపై ఈసీ స్పష్టత ఇచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని 'సువిధ' పోర్టల్ లో 48గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని తెలిపారు.
EC CEO Mukesh Kumar Meena Video Confidence : ఆఫ్ లైన్ లో వచ్చే దరఖాస్తులను కూడా అత్యవసరంగా పరిష్కరించి వాటిని ఎన్ కోర్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న హోర్డింగ్‌లను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలన్నారు. నూతన హోర్డింగ్‌లకు అనుమతి ఇవ్వొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకూ అనుమతిలేదన్నారు. మోడల్ కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే రాజకీయ పార్టీలు 'సువిధ' పోర్టల్ లో అనుమతులు తీసుకునేలా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు ప్రజలకు పాంప్లెట్లను ఇచ్చేందుకు కూడా తప్పనిసరిగా సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
ఆ ముగ్గురూ పూర్తి వివరాలతో రావాలి - రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాలు
పెండింగ్‌లో ఉన్న ఫాం 7, ఫాం 8 లను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి జాబితాను సవరించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు నగదు, బహుమతుల పంపిణీ అంశాలపై విస్తృతంగా ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు సీఈఓ సూచించారు.
అయితే కేవలం ప్రతిపక్ష పార్టీలకు నిబంధనలు పెట్టి అధికార పార్టీ నాయకులు కుక్కర్లు, చీరలు, డబ్బులు మద్యం పంపిణీ చేసుకోవచ్చా అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ చర్యలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ఇదేనా పారదర్శకత అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. టీడీపీ తరపున ఏం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు ఇది పూర్తిగా అభ్యంతరకరమన్నారు. ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలి, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: హరేంథిర ప్రసాద్