Polavaram Project Funds: పోలవరం తొలిదశ పనులను వేగంగా పూర్తి చేయడానికి 12 వేల 157 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు.. జల్‌శక్తి శాఖ సంసిద్ధమవుతోంది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనుల పూర్తికి 12 వేల 157 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం చేసిన విజ్ఞప్తికి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి CR పాటిల్..సముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మల నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు దిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం ఇచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్తది నిర్మించేందుకు ప్రస్తుత గుత్తేదారు ద్వారానే కొనసాగించాలా, కొత్తవారితో చేపట్టాలా స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టుపై ముందుకు వెళతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీయే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, సీఎం చంద్రబాబు సారథ్యంలో పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి రామానాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వైఎస్సార్సీపీ సర్కారు వెనక్కు తీసుకుపోయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆ వివరాలన్నీ జల్‌శక్తి మంత్రికి చెప్పామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఎన్డీయే హయాంలో పనులు వేగంగా సాగుతాయని మరో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ధీమా వ్యక్తం చేశారు. వీరంతా జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీని సైతం కలిసి పోలవరం పరిస్థితిని వివరించారు.
కేంద్రమంత్రికి విన్నవించిన అంశాలు:
- పోలవరం తొలిదశ పనులు పూర్తిచేయడానికి వీలుగా అందుబాటులో ఉన్న 12 వేల 157 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరారు.
- ప్రాజెక్టు ఒరిజినల్ డీపీఆర్ ప్రకారం ఎడమ కాలువను 8 వేల 123, కుడి కాలువను 11 వేల 654 క్యూసెక్కుల డిశ్ఛార్జి సామర్థ్యంతో ఖరారుచేశారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం రెండు కాలువల డిశ్ఛార్జి సామర్థ్యాన్ని 17 వేల 500 క్యూసెక్కులకు పెంచారు. 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనాలను 2019లో టీఏసీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఒరిజినల్ సామర్థ్యం ప్రకారమే నిధులను రీయింబర్స్ చేస్తోంది. అయితే వాటిని సవరించిన సామర్థ్యాల ప్రకారం కుడి కాలువ పనులు 93 శాతం, ఎడమ కాలువ పనులు 73 శాతం పూర్తయ్యాయి. ఈ మేరకు ఖర్చులను చెల్లించాలని విన్నవించారు.
- 2024 జూన్ వరకు పోలవరం ప్రాజెక్టుపై రూ.21,898.28 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో రూ.17,167.57 కోట్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక వెచ్చించారు. ఇప్పటివరకు ఖర్చు చేసిన దానిలో రూ.15,146.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించింది. బకాయి ఉన్న రూ.2,021.30 కోట్లనూ ఇవ్వాలన్నారు.