Hyderabad Bengaluru Industrial Corridor allocated in budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు.
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేలకు నిధులు కేటాయించారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు మంజూరు చేసినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయనున్నాట్లు తెలిపారు. మహానగరాల పునర్ అభివృద్ధికి నూతన ప్రణాళిక తయారు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే విస్తరించిన నగరాల్లో సృజనాత్మక అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణ మధ్యతరగతి పేదల నివాస సముదాయాల అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు నిర్మల తెలిపారు. పీఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలు ఏర్పాటు చేస్తామని నిర్మల పేర్కొన్నారు.