Celebrations in Andhra Pradesh: కూటమి అభ్యర్థుల ఘన విజయంతో విజయవాడలో సంబరాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ గెలుపొందడంతో బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుతో బాపట్ల జిల్లాలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
బాపట్ల పార్లమెంట్ స్థానంతో పాటు, బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ నిడదవోలులో ప్రసిద్ధ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో జనసేన, టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
సింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణి శ్రీ ఘనవిజయం సాధించడంతో అనంతపురం అరవింద్ నగర్ లోని ఆమె ఇంటి వద్ద బాణసంచా కాల్చి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు అత్యధిక మెజార్టీతో గెలవడంతో కళ్యాణదుర్గంలో కూటమి శ్రేణులు, నాయకులు, బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నివాసం వద్ద కోలాహలం నెలకొంది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దామచర్ల జనార్ధన్ కు పూలతో స్వాగతం పలికారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలి వద్ద కూటమి శ్రేణులు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం కౌంటింగ్ కేంద్రాల వద్ద కూటమి అభ్యర్థులు, శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయం సాధించటంతో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి, సంబరాలు చేసుకున్నారు.
అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 నియోజకవర్గాలలో 3 చోట్ల కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు విజయకేతనంతో ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ విజయంపై కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు. మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి 13733 ఓట్లు మెజార్టీతో విజయం సాధించడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి నివాసానికి చేరుతున్న ఆమెకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.