CEC Meeting with Govt officials: ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడమేగాక రాత్రి 9 గంటల్లోపు మొత్తం ప్రక్రియ ముగించి ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. మొత్తం 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు లెక్కింపు పూర్తవుతుందని మరో 61 నియోజకవర్గాల్లో 24 రౌండ్లు ఉన్నాయన్నారు. కేవలం 3 నియోజకవర్గాల్లోనే 25 రౌండ్ల వరకూ లెక్కింపు కొనసాగుతుందని వెల్లడించారు. కేంద్ర డివ్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ నిర్వహించిన సమీక్షలో సీఈవో సహా రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
హాజరైన వివిధ శాఖల అధిపతులు: జూన్ 4న ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ నితీశ్‌వ్యాస్ నిర్వహించిన సమీక్షలో సీఈవోతోపాటు ఆర్వోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం కల్లా ట్రెండ్ తెలిసిపోతుందని 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల కల్లా లెక్కింపు పూర్తవుతుందన్నారు. మరో 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల్లోపు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అదనపు టేబుళ్లు పెంచి సకాలంలో వాటి లెక్కింపు పూర్తిచేస్తామన్నారు.
అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు: ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 8 నుంచి 9గంటల్లోపు అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా చర్యలు చేపట్టామని సీఈవో మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జిల్లాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పల్నాడు జిల్లాలో డిజీపీతో పాటు తాను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చేసినట్లు రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి శంఖబ్రత బాగ్చి ఈసీ అధికారులకు వెల్లడించారు.
ఓట్ల లెక్కింపులో జాప్యానికి తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తైయిన వెంటనే పార్లమెంటు, శాసనసభ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి, 21ఇ అదే రోజు విమానంలో ఈసీఐకి పంపాల్సిందిగా సూచనలిచ్చారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు.