CBI on Indu Tech Scam Case: వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంనాటి కుంభకోణాల్లో ఇందూటెక్ సెజ్ భూముల కేటాయింపు ఒకటి. ఇందూటెక్ జోన్ పేరిట శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో 250 ఎకరాలను తన సన్నిహితుడైన ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డికి వైఎస్ అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ తేల్చింది.
ప్రతిగా నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీల ద్వారా శ్యాంప్రసాద్‌రెడ్డి రూ.70 కోట్లను జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మళ్లించినట్లు పదేళ్ల క్రితమే హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది. జగన్‌ను ఏ1గా, విజయసాయిరెడ్డిని ఏ2గా, ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డిని ఏ3గా చేర్చింది. గరిష్ఠంగా జీవిత ఖైదీ పడే అవకాశమున్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా నిందితులు ఇప్పటికే 234 వాయిదాలు తీసుకున్నారు.
అది 2004 సెప్టెంబరు 30. 7,500 ఎకరాల్లో ఐటీ సెజ్‌లు ఏర్పాటు చేయాలని అప్పుటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మామిడిపల్లి, రావిర్యాలలో 1,582 ఎకరాల్లో ఐటీ సెజ్ ఏర్పాటుకు అనుమతి కోరుతూ 2005 అక్టోబరు 19న కేంద్రానికి ఏపీఐఐసీ(APIIC) లేఖ రాసింది. అదే రోజు రాజశేఖరరెడ్డి, జగన్‌ల సన్నిహితుడు ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి రంగంలోకి దిగారు.!
సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం
ప్రభుత్వానికి వేర్వేరు సందర్భాల్లో మూడుసార్లు దరఖాస్తులు చేసుకున్నారు.! 2005 డిసెంబరులో అప్పటి ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి కె.రత్నప్రభ అధ్యక్షతన సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. కంపెనీలకు భూములు కేటాయిచాలంటే కనీసం 40 లక్షల చదరపు అడుగుల భారీ నిర్మాణాలు చేసిన అనుభవం, 250 కోట్ల రూపాయల నికర విలువ ఉన్న సంస్థలకు 250 ఎకరాల చొప్పున దశలవారీగా కేటాయించాలని నిర్ణయించారు.
అయితే రత్నప్రభ ఈ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది. సెజ్ అభివృద్ధికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెండర్లు పిలవాల్సి ఉండగా అవేవీ చేయకుండానే ఇందూ ప్రాజెక్ట్స్, బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, రహేజా కార్పొరేషన్ దరఖాస్తులను పరిశీలించాలని ఏపీఐఐసీ కి రత్నప్రభ నోట్ పంపించారు.
నిర్ణీత నమూనాలో దరఖాస్తు సమర్పించాలన్న ఏపీఐఐసీ సూచనతో 2006 జనవరి 20న శ్యాంప్రసాద్‌రెడ్డి తమకు సెజ్ అభివృద్ధి కోసం 250 ఎకరాలు కేటాయించాలని, ఐడీఎఫ్‌సీ, గోల్ఫ్ లింక్స్ సాఫ్ట్‌వేర్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి కన్సార్షియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇందూ ప్రాజెక్ట్స్‌కు ఉన్న అనుభవం, అర్హతలను పరిశీలించకుండానే అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య 20 లక్షల రూపాయలకు ఎకరం చొప్పన కేటాయించాలని నోట్ పంపించారు.
కానీ ఐటీ సంప్రదింపుల కమిటీ నిర్ణయించిన ధర ఎకరాకు 26 లక్షలు. ఎకరాకు 20 లక్షల రూపాయల ధర చాలా తక్కువని, వాస్తవంగా కోటి రూపాయలు ఉందని రెవెన్యూ శాఖ అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఏపీఐఐసీ నివేదిక ఆధారంగా ఇందూ ప్రాజెక్ట్స్‌కు ఒకేసారి 250 ఎకరాలు కేటాయించాలని 2006 ఫిబ్రవరి 2న రత్నప్రభ అధ్యక్షతన జరిగిన నిర్వహించిన సమావేశంలో సిఫార్సు చేశారు.
సెజ్ అభివృద్ధికి ముసాయిదా ఎమ్ఓయూని ఐటీ శాఖ 2006 మార్చి 21న తయారు చేసి ఏపీఐఐసీకి పంపింది. రాష్ట్ర ఐటీ పాలసీ ప్రకారం 250 ఎకరాలకు 83 వేల 333 ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా 40వేల ఉద్యోగాలే ప్రతిపాదించారు. ముసాయిదాను రత్నప్రభ నేరుగా నాటి ఐటీ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పంపించారు. మంత్రి సైతం కుట్రలో భాగస్వామ్యమై ముసాయిదాను ఆమోదించినట్లు సీబీఐ పేర్కొంది. సీఎం వైఎస్ సమ్మతితో 2006 ఏప్రిల్ 29న ఎమ్ఓయూకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
అవినీతితో జగన్ దోస్తీ - తండ్రి హయాంలో భారీగా అక్రమాలు
మంత్రివర్గం ఆమోదం తర్వాత ఇందూటెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఎస్పీవీ ఏర్పాటు చేశామని, 250 ఎకరాలను ఆ పేరుతోనే కేటాయించాలని 2006 మే నెలలో ఇందూ ప్రాజెక్ట్స్ లేఖ రాసింది. మొదట చెప్పినట్లుగా కన్సార్షియంలో ఐడీఎఫ్‌సీ, గోల్ఫ్ లింక్స్ సాఫ్ట్‌వేర్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ లేవని తెలిసినా రత్నప్రభ ఆమోదించారు.
సెజ్ అభివృద్ధి కొనసాగుతుండగానే 100 ఎకరాలను విక్రయించుకునేలా ఎమ్ఓయూలో మార్పులను కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం, ఏపీఐఐసీ అనుమతివ్వకముందే ఇందూటెక్ జోన్‌లో షేర్ల అమ్మకాలు ప్రారంభించారు. కరిస్సా ఎస్‌ఏ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వాటాలు అమ్మి రూ.75 కోట్లు, నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన జీ2 కార్పొరేట్ సర్వీసెస్‌కు షేర్లు అమ్మి రూ.28 కోట్లు అక్రమంగా లబ్ధి పొందారు.
ప్రభుత్వ అనుమతి లేకుండానే 100 ఎకరాలను శ్యాంప్రసాద్ కుటుంబానికే చెందిన ఎస్పీఆర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఆ వంద ఎకరాలను పూచీకత్తుగా పెట్టి రుణం తీసుకొనేందుకు, ఇతరులకు అమ్మేందుకు అభ్యంతరం లేదంటూ అప్పటి పరిశ్రమలశాఖ కార్యదర్శి బీపీ ఆచార్య నిరభ్యంతర పత్రాలు ఇచ్చారని సీబీఐ వివరించింది.
తనకు అన్నివిధాలా సహకరించినందుకు శ్యాంప్రసాద్‌రెడ్డి.. జగన్ కంపెనీలైన జగతి పబ్లికేషన్స్‌లోకి రూ.50 కోట్లు, కార్మెల్ ఏషియాలోకి రూ.20 కోట్లు పెట్టుబడి రూపంలో పెట్టారు. అయితే నేరుగా కాకుండా నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీల ద్వారా మళ్లించారు. ఈ వ్యవహారంపై సీబీఐ 2013 సెప్టెంబరు 17న ఛార్జిషీట్ వేసింది.
మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చింది. కేసు విచారణ పదేళ్లుగా సాగుతోంది. ఇప్పటికి 234సార్లు వాయిదా పడింది. తమపై కేసు కొట్టేయాలని జగన్, విజయసాయిరెడ్డి తదితర నిందితులు వేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ సీబీఐ కోర్టులో తేలాల్సి ఉంది. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కూడా 2018 ఫిబ్రవరి 3న ఛార్జిషీట్ దాఖలు చేసింది.
జగన్, విజయసాయిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డితో పాటు 17 మందిని నిందితులుగా చేర్చింది. మామిడిపల్లి సెజ్‌కు కేటాయించిన 250 ఎకరాలు జప్తు చేసింది. జీడిమెట్లలో ఇందూ గ్రూప్‌కు చెందిన వాల్టన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న 2 వేల 835 చదరపు గజాల స్థలాన్ని తాత్కాలిక జప్తు చేసింది.
శ్యాంప్రసాద్‌రెడ్డి సంస్థలు.. అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించగా విచారణ పెండింగులో ఉంది. సీబీఐ, ఈడీ నమోదు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం నిందితులకు గరిష్ఠంగా జీవితఖైదు పడే అవకాశముంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష అనుభవించిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదు.
సీబీఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా సాగుతున్న జగన్ - 381వ సారి వాయిదా