Cars Were Heavily Damaged in Flood Disaster At Vijayawada: విజయవాడలో వరద బీభత్సానికి కార్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. కృష్ణమ్మ మహోగ్రరూపం, బుడమేరులో ఊహించని వరదకు ఇంటి సెల్లార్లోనే కాకుండా రోడ్డుపక్క పార్కు చేసిన కార్లు సైతం తలకిందులయ్యాయి. వరద తగ్గుముఖం పట్టడంతో దెబ్బతిన్న కార్లను షోరూమ్‌ల వద్దకు తీసుకొచ్చి సర్వీసింగ్ చేయించేందుకు యజమానులు నానాయాతన పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్టంగా 70 వేలు నుంచి లక్ష రూపాయలపైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 12 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు కొనుగోలు చేసిన కార్లలో కొన్నింటికి కనీస రీసేల్ ధర కూడా వచ్చేలా లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
వరదలో కొట్టుకుపోయిన వాహనాలు - బయటకు తీసేందుకు భారీగా డబ్బులు డిమాండ్ - MONEY DEMAND AT ITHAVARAM
విజయవాడలోని వరద ప్రభావ ప్రాంతాల్లో ఎటుచూసినా వాహనాలు రోడ్లపై చెల్లాచెదురయ్యాయి. నీటి ప్రవాహానికి పార్కింగ్ చేసిన వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. మరికొన్ని కాల్వల్లో బోర్లాపడ్డాయి. ఇంకొన్ని తల్లకిందులై నీటమునిగిపోయాయి. నీటి ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వాహనదారులు కార్లను షోరూమ్‌లకు పంపుతున్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా వేలాది కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరమ్మతులకు సైతం భారీగా ఖర్చు అవుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూమ్‌లలో వరద నీరు చేరింది. సింగ్ నగర్, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో వేల సంఖ్యలో కార్లు నీటిలో మునిగాయి. కార్ల నష్టాన్ని అంచనా వేయలేని రీతిలో ఉన్నాయి.
సుమారు 40కుపైగా కార్లను రిపేరు చేశాం. మరో 4,5 రోజుల్లో వాహనాలు రిపేరుకు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువున్నాయి. కస్టమర్లకు పూర్తిగా సహాకరించి ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తున్నాం. పూర్తిగా నీటమునిగిన కారుకి సుమారు లక్షన్నర నుంచి 2 లక్షలు అవుతుంది. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ప్రభుత్వం కొంత మేర సాయం చేస్తే తాము కూడా సహకరిస్తాం. -రామకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్, మిత్ర ఏజెన్సీస్, విజయవాడ
వరద ఉద్ధృతి తగ్గడంతో కాలనీల నుంచి వివిధ కంపెనీలకు చెందిన కార్లను ట్రక్‌లపై, గొలుసులతో కట్టి ఏదో విధంగా సర్వీసు సెంటర్లకు తీసుకువస్తున్నారు. పలు ప్రాంతాలలో నీరు ఉన్నందున ఇంకా కొన్ని కార్లు వరదలోనే నానుతున్నాయి. సర్వీస్ కోసం వచ్చిన కార్లకు లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉందని, వరదల్లో తడిసిన కార్లను సర్వీస్ చేయిస్తే దూరప్రయాణాలతో ఇబ్బందులు తలెత్తవని సలహా ఇస్తున్నారు. అలాగే కార్లకు జరిగిన నష్టాన్ని 3 విభాగాలుగా విభజించి, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు కూడా తమ వంతు కర్తవ్యంగా ఆర్థిక భారం కాకుండా చేస్తామని కంపెనీల మేనేజర్లు చెబుతున్నారు. కార్లకు మరమ్మత్తుల కోసం భారీగా ఖర్చు కావొస్తుండడంతో ఏదో ఓ ధరకు విక్రయించి కొత్త వాటిని చూసుకోవడమే మేలనే అభిప్రాయంతో కొందరు యజమానులున్నారు.
కార్ల స్టాక్ యార్డులకు వరద ఎఫెక్ట్ - నీటమునిగిన వాహనాలు - Huge Cars Damage in Mustabad