Careless on Family Planning Program : నెల్లూరు జిల్లాలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు మొక్కుబడిగా సాగిస్తున్నారు. ఏటా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నెల్లూరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం గమనార్హం.
జనాభా పెరుగుదల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించేందుకు, ప్రజల్లో ఆ దిశగా చైతన్యం తెచ్చేందుకు ప్రతీ సంవత్సరం జులై 11న ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day 2024) నిర్వహిస్తోంది. యూఎన్ పాపులేషన్ ఫండ్(యూఎన్‌ఎఫ్‌పీఏ) సమన్వయంతో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) సంయుక్తంగా ఏటా ఒక్కో థీమ్‌ను నిర్ణయిస్తాయి. ఈ సంవత్సరం థీమ్ ఎవరినీ వదిలిపెట్టొద్దు. ప్రతి ఒక్కరినీ లెక్కించండి (టు లీవ్ నో ఒన్ బిహైండ్, కౌంట్ ఎవరి ఒన్).
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు : ఆడ, మగ వివక్ష సైతం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2001లో ప్రతి వేయి మంది పురుషులకు 984 మంది స్త్రీలు ఉంటే ప్రస్తుత లెక్కల ప్రకారం 983 మాత్రమే ఉంటున్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదంటూ భ్రూణ హత్యలపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా దాన్ని మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
పునర్విభజన అనంతరం జిల్లాలో 38 మండలాలు ఉండగా - ప్రస్తుత లెక్కల ప్రకారం 26,62,265 మంది జనాభా ఉన్నారు. గత సంవత్సరం కంటే సుమారు పది వేల పెరుగుదల నమోదు అయ్యింది. ప్రతి చదరపు కి.మీ.కు 229 మంది ఉన్నారు. అక్షరాస్యత శాతం 84.50గా ఉంది.
జనాభా పెరుగుదల ప్రభావం : నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, ఆత్మకూరు, కందుకూరు మున్సిపాలిటీల్లో 40శాతం లోపు జనాభా ఉండగా - మిగిలిన వారు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 6.37 లక్షల ఇళ్లు ఉండగా జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడకపోవడంతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజారోగ్యంపైనా జనాభా పెరుగుదల ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 61 పీహెచ్‌సీలు, 10 సీహెచ్‌సీలు ఉండగా వీటి సంఖ్యను మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. స్పెషలిస్టుల సంఖ్యనూ పెంచాల్సి ఉంది.
మొక్కుబడిగా సాగుతున్నాయనే విమర్శలు : కుటుంబ నియంత్రణ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవన్నీ మొక్కుబడిగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అవాంచిత గర్భాల నివారణ, లైంగిక సాంక్రమణ వ్యాధుల కట్టడికి అందించే సామగ్రి సైతం పూర్తి స్థాయిలో సరఫరాకు నోచుకోవడం లేదు. ఎక్కువగా డీఎంహెచ్‌వో కార్యాలయానికే పరిమితమవుతున్నాయి. పెద్ద ఎత్తున పెట్టెలు కార్యాలయ ఆవరణలోనే మగ్గుతున్నాయి. గతంలో కాలం చెల్లి మూలకు చేరిన సంఘటనలు ఉన్నాయి. గత సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9422, ప్రైవేటులో 19,535 ప్రసవాలు జరిగాయి. వీటిల్లో 50 శాతం రెండో కాన్పులే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు మాత్రం వ్యాసెక్టమీ 8, ట్యూబెక్టమీ 7,361 జరగడం ప్రస్తావనార్హం.
"నెల్లూరు జిల్లాలో కుటుంబ నియంత్రణ చర్యలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. లక్ష్యం మేరకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి." - ఎం. పెంచలయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి