Amaravati Works Restarting from Dec 15th: రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు 15వ తేదీ నుంచే రాజదానిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభించేలా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. పాత ఒప్పందాలను రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలిచి మళ్లీ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
గతంలో అమరావతి పనులు చేపట్టిన సంస్థలు నాగార్జున కనస్ట్రక్షన్స్, కేఎంవీ ప్రాజెక్ట్స్, బీఎస్ఆర్ ఇన్ఫ్రాలకు కొత్తగా ఒప్పందాలు కేటాయించారు. అమరావతి ప్రాంతంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల నివాసానికి అనుగుణంగా చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలను పూర్తి చేసే బాధ్యతను కేఎంవీ సంస్థకు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల అపార్టమెంట్లను, గెజిటెడ్ అధికారుల నివాసాలను పూర్తి చేసే టెండర్ ఎన్సీసీ దక్కించుకుంది. ఇక నాన్ గెజిటెడ్ అధికారుల ఆవాసాలను పూర్తి చేసే పనుల టెండర్ ఎల్ అండ్ టీకి వచ్చింది.
మరోవైపు జడ్జిలు, మంత్రుల బంగ్లాల ప్రాజెక్టు నిర్మాణాల టెండర్ బీఎస్ఆర్ ఇన్ఫ్రాకు వచ్చింది. ఈ భవనాల నిర్మాణానికి అయ్యే వ్యయం 1872 కోట్లుగా సీఆర్డీఏ తేల్చింది. దశలవారీగా భవన నిర్మాణాల పనుల్ని ప్రారంభించి వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 15వ తేదీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలభారత సర్వీసు అధికారులు, ఎన్జీఓ హౌసింగ్, మంత్రులు, జడ్జిల నివాస బంగ్లాల నిర్మాణ పనులు పునః ప్రారంభం కానున్నాయి. శాసన సభ్యులు, అఖిలభారత సర్వీసు అధికారుల క్వార్టర్లను పూర్తి చేసేందుకు 6 నెలలు గడువు విధించారు. అలాగే గెజిటెడ్ అధికారులు, న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలు పూర్తికి 9 నెలల సమయంలోగా పూర్తి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయం 2019తో పోలిస్తే 80.3 శాతం మేర పెరిగినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపుగా రూ.1132 కోట్ల రూపాయల మేర అదనపు వ్యయం అవుతుందని సీఆర్డీఏ స్పష్టం చేస్తోంది. అఖిలభారత సర్వీసు అధికారుల బంగళాల నిర్మాణం కోసం చదరపు అడుగుకు అయ్యే వ్యయం కూడా దాదాపు 86.5 శాతం మేర పెరిగింది. ఒక్కో చదరపు అడుగుకు గతంలో రూ.6307 రూపాయలుగా నిర్ధారిస్తే ప్రస్తుతం అది రూ.10,829 లకు పెరిగింది. అటు ఎన్జీఓ హౌసింగ్ ప్రాజెక్టు వ్యయంలోనూ 79 శాతం మేర పెరుగుదల ఉన్నట్టు సీఆర్డీఏ స్పష్టం చేస్తోంది. దీంతో ఆ ప్రాజెక్టులో చదరపు అడుగు వ్యయం రూ.3061 నుంచి రూ.4410 కి పెరిగింది. గెజిటెడ్ ఆఫీసర్లకు చెందిన నివాసాల ప్రాజెక్టులో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.3,255 నుంచి రూ.4,556కి పెరిగింది.
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి - 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం