Can We Get A Passport if We have A Case? : హైదరాబాద్ నగరానికి చెందిన రామారావు ఓ ప్రైవేటు ఉద్యోగి. అతని ఇద్దరు కుమారులు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. తన పుత్రులను చూసేందుకు భార్యతో కలిసి ఆయన యూఎస్ఏ వెళ్లాలనుకున్నారు. కొంతకాలం క్రితం అతనిపై నమోదైన క్రిమినల్ కేసుతో పాస్‌పోర్ట్ అప్లికేషన్, జారీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి కారణం పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకున్నాక కేసు పెండింగ్‌లో ఉన్న విషయం అందులో పేర్కొనలేదు.
పాస్‌పోర్ట్‌కు సంబంధించి పోలీస్ వెరిఫికేషన్‌లో మాత్రం కేసు ఉన్న విషయం వెల్లడి కావడంతో అధికారులు రామారావుకు పాస్‌పోర్ట్‌ను తిరస్కరించారు. అనంతరం ఆయన పాస్‌పోర్టు అధికారులను సంప్రదించగా తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పును చూపిస్తూ ‘క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నా సంబంధిత కోర్టునుంచి ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) లేకుండా పాస్‌పోర్టు పునరుద్ధరణ, జారీ చేయడం కుదరదని’ అధికారులు తెలిపారు.
Telangana HC On Passport Issue : క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఎన్‌వోసీ లేకుండా తమకు పాస్‌పోర్టు జారీచేసేలా ఆదేశించాలంటూ పలువురు చేసిన అభ్యర్థనలను హైకోర్టు ఇటీవల తిరస్కరిస్తూ తీర్పును వెలువరించింది. ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాత మాత్రమే పాస్‌పోర్టు పునరుద్ధరణను పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. విచారణ న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులిచ్చాక కేసు పెండింగ్‌లో ఉందంటూ పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, జారీని నిరోదించవద్దని తెలిపాయి.
మీ పాస్‌పోర్ట్ చిరిగిందా? లేదా పోగొట్టుకున్నారా? - ఐతే ఏం చేయాలో తెలుసా? - Passport Reissue Process
కేసుల వివరాలు పొందుపర్చడం తప్పనిసరి : తెలిసో తెలియక క్షణికావేశంలో తప్పులు చేసిన వారు, ఇతరుల కుట్రతో కేసులో ఇరుక్కునేవారు పాస్‌పోర్ట్ రాదనే భయంతో దరఖాస్తుల్లో తమపై కేసులకు సంబంధించిన వివరాలు పొందుపరచడం లేదు. తీరా వెరిఫికేషన్‌కు వచ్చేసరికి పోలీసులు, పాస్‌పోర్ట్ అధికారులు గుర్తించి తిరస్కరిస్తున్నారు. ఒక్కసారి అప్లికేషన్ తిరస్కరణకు గురైతే మళ్లీ దరఖాస్తుకు సుమారు 45 రోజులు పడుతుండటంతో విదేశాల్లో ఉన్న తమ పిల్లలను చూడటానికి వెళ్లాల్సిన తల్లిదండ్రులు, కుమార్తె పురుడు కోసం వెళ్లాల్సిన తల్లులు, వేడుకలకు హాజరవ్వాల్సిన వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కేసులు నమోదైనంత మాత్రాన వారు దోషులు కారని, కోర్టు అనుమతితో పాస్‌పోర్టు పొందవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ తరహా కేసులే ఎక్కువ : రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 4000 పాస్‌పోర్టులు మంజూరవుతుండగా ఇవి కాకుండా 10 నుంచి 15శాతం మేర వేర్వేరు కారణాలతో రిజక్ట్ చేస్తున్నారు. వీటిలో 2 నుంచి 5శాతం మంది వారిపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను దరఖాస్తులో పొందుపరచడం లేదు. ఇందులో 506, 509, 504, 323, 498 కేసులు నమోదైనవారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో వీటిని గుర్తిస్తుండటంతో ఆయా అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి.
దరఖాస్తు సమయంలోనే : కేసులు నమోదైన విషయాన్ని వెల్లడించడం ద్వారా ఎలాంటి నష్టం లేదని అధికారులు చెబుతున్నారు. ముందస్తుగానే న్యాయస్థానం అనుమతి తీసుకునే వెసులుబాటు ఉందని, అఫిడవిట్ రూపంలో అనుమతి తీసుకుని అప్లికేషన్ సమర్పించడం లేదా పాస్‌పోర్టు తిరస్కరణకు గురైన తర్వాతైనా కోర్టు అనుమతితో తిరిగి పాస్‌పోర్టు పొందొచ్చని సూచిస్తున్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్‌లో ఉంటే మాత్రం ఆయా విచారణ కోర్టుల నుంచి అనుమతి తప్పనిసరి. లేదా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అనుమతి పొందవచ్చని ఉందని నిపుణులు సూచిస్తున్నారు.