Campus Recruitment Training by JNTU Gurajada Vizianagaram : ఇంజినీరింగ్ కళాశాలలో కొలువుల సందడి మొదలైంది. ఆగస్టు నుంచే కొన్ని కంపెనీలు ప్రాంగణ నియామక ప్రక్రియ మొదలు పెట్టాయి. అయితే విద్యార్థుల్లో గ్లోబల్ స్థాయి నైపుణ్యాలు ఉంటే తప్ప పోటీల్లో రాణించలేరు. సర్టిఫికేషన్ కోర్సుల్లో పూర్తి స్థాయి పట్టు పెంపొందించుకోవాలి. అకడమిక్‌లో కనీసం 60% మార్కులు సాధించాలి. ఆంగ్లం, సాఫ్ట్ స్కిల్స్, భావవ్యక్తీకరణ ముఖ్యం.
ఈ నేపథ్యంలో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించే పనిలో విజయనగరం జిల్లాలోని JNTU గురజాడ ఇంజినీరింగ్ కళాశాల శ్రీకారం చుట్టింది. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగుపరుచేందుకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ నిర్వహిస్తోంది.
"ప్రభుత్వ కళాశాలలకూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారు. కానీ తగిన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందటం లేదు. అందుకే క్యాంపస్ రిక్రూట్ మెంట్ ట్తైనింగ్ పేరిక ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తున్నాము. దీని ద్వారా విద్యార్థులకు మేథమెటికల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్, సాంకేతిక నైపుణ్యాలు, ఎనలిటికల్ స్కిల్స్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, టీంవర్క్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలపై పట్టు వస్తుంది. దీంతో వివిధ కంపెనీలు క్యాంపన్ రిక్రూట్‌మెంట్ చేసుకునేటప్పుడు మా విద్యార్థులు ఈజీగా అర్హత సాధిస్తారు." - రాజేశ్వరరావు, ప్రిన్సిపల్ జేఎన్టీయూ-గురజాడ, విజయనగరం
కెరీర్‌కు ఉపయోగపడే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహణపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా కళాశాలలోనే తరగతులు నిర్వహించటంతో ఆర్థికంగానే కాక సమయం కూడా ఆదా అవుతోందంటున్నారు. ఈ ప్రత్యేక తరగతుల ఏర్పాటుతో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం తప్పక సాధిస్తామన్న నమ్మకం పెరిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
"ఇవే స్కిల్స్‌ను బయట పెంపొందిచుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మా కాలేజీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్తైనింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఉచితంగా కళాశాలలోనే తరగతులు నిర్వహించటంతో ఆర్థికంగానే కాక సమయం కూడా ఆదా అవుతోంది. కళాశాల్లో చదువుతున్న సమయంలో AWS క్లౌడ్, సిస్కో, నెట్ కేడ్, డేటాబెస్ సర్టిఫికేషన్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. కృత్రిమమేథ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, IOT, క్లౌడ్ కంప్యూటరింగ్, బిగ్ డేటా లాంటి వాటిలో ప్రతిభను పరీక్షిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని శిక్షణ తరగతుల్లో విద్యార్థులకు ఆయా అంశాలను వివరిస్తున్నారు. ఈ ప్రత్యేక తరగతుల ఏర్పాటుతో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం తప్పక సాధిస్తామన్న నమ్మకం పెరిగింది." - కళాశాల విద్యార్థులు
ఉత్తరాంధ్రలోని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసీఈ, ట్రిపుల్‌ఈ విద్యార్థులకు మాన్ చిప్ కంపెనీ ఇంజినీర్ల నియామకానికి పరీక్ష జరిపింది. కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహించింది. మేథా సర్వే, L&Tలు ఇప్పటికే అంతర్జాలంలో దరఖాస్తుకు ఆహ్వానించాయి. త్వరలో విప్రో, అసెంజర్, హెక్సావేర్ కంపెనీలు ఉత్తరాంధ్రలోని ఇంజినీరింగ్ కళాశాల్లో ప్రాంగణ ఎంపిక ప్రక్రియను షురూ చేయనున్నాయి.
ఐడియా అదుర్స్ - హైడ్రోజన్‌తో నడిచే హైబ్రిడ్ స్కూటీ ఆవిష్కరణ - Hybrid Bike Runs with Hydrogen
ఐటీ కోర్సుల వారికి కోడింగ్‌తో పాటు అదనంగా సర్టిఫికేషన్ నైపుణ్యాలు అవసరం. ఏడబ్ల్యూఎస్, నెట్ వర్క్ తదితర కోర్సుల్లో పట్టున్న వారికి కంపెనీలు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ముందు నుంచే ఆసక్తితో వీటిని చదవటం ద్వారా విద్యార్ధులు, ఉద్యోగ అవకాశాలు సులువుగా పొందవచ్చు. ఈ అంశాలను విద్యార్ధులకు కూలంకుషంగా తెలియజేస్తున్నారు.
ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో యువత రోజురోజుకి వెనకబడుతున్నారు. పట్టా చేతపట్టి ఏళ్లు గడిచినా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ తరుణంలో ప్రాంగణ ఎంపికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు యువతలో నైపుణ్యాభివృద్ధి కారణం అవుతాయి.