CAG Report on Trauma Care Centrer Situation : రాష్ట్రంలో ఏటా సగటున 21 వేల రోడ్డు ప్రమాదాలు (Road Accidents on National Highway) జరుగుతుండగా వాటిల్లో 8 వేల మందికిపైగా మృతి చెందుతున్నారు. 21 వేల మందికిపైనే గాయాలపాలవుతున్నారు. దాదాపు 45 శాతం జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా చెన్నై-కోల్‌కతా, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు అధికంగా జరిగే జాతీయ రహదారుల పొడవునా ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక ట్రామాకేర్ కేంద్రం పెట్టి అన్ని రకాల సదుపాయాలనూ కల్పించాలి. 24 గంటలూ పని చేసేలా తీర్చిదిద్దాలి. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో అత్యవసర చికిత్స అందితే 54 శాతం నుంచి 90 శాతం వరకు ప్రాణాలు కాపాడవచ్చు. కానీ, సరిపడా ట్రామా కేంద్రాలు రాష్ట్రంలో లేకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది.
జాతీయ మార్గదర్శకాల ప్రకారం వైద్యులు, పడకలు సౌకర్యాల కల్పనపరంగా రాష్ట్రంలోని ఒక్క ట్రామా కేంద్రమూ ప్రథమ శ్రేణిలో లేదు. విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోనివి ద్వితీయ శ్రేణిలో శ్రీకాకుళం, అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోనివి తృతీయ శ్రేణిలో ఉన్నాయి. వీటిల్లోనూ వైద్యులు, వైద్య పరికరాలు అరకొరగానే ఉన్నాయని కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ నేతృత్వంలో ఏర్పాటైన అధ్యయన కమిటీ స్పష్టం చేసింది.
రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణాలపై జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం: కాగ్
Trauma Care Centrer Situation in Andhra Pradesh : కేంద్ర నిధులతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రి, తిరుపతి జిల్లా నాయుడు పేటలోని సీహెచ్‌సీలో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో 42 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరం. వీటి పనితీరుపట్ల 'కాగ్ (CAG)' తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. టెక్కలి ట్రామాకేర్ సెంటర్‌లో కేవలం ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తుండటంతో క్షతగాత్రులకు తగిన సేవలు అందడం లేదు. సమీప 13 మండలాల పరిధిలో 100 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారి ఉంది. 2012లో 65 లక్షలతో పూర్తి చేసిన ఈ కేంద్రంలో పరికరాల కోసం 2 కోట్లను కేటాయించారు. 2013లో ఇద్దరు వైద్యుల్ని, 12 మంది స్టాఫ్ నర్సులు, MNO, FNO లు 9 మందిని, ఇతర సిబ్బందిని నియమించారు. జీతాలు సరిగా రాక ఇద్దరు వైద్యులతో పాటు 12మంది స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది మానేశారు.
20లక్షల విలువైన అత్యాధునిక అంబులెన్స్ వినియోగించకుండానే మూలకు చేరింది. అధిక శాతం యంత్రాలన్నీ తుప్పుపట్టడంతో బాధితులను జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. నాయుడుపేట సీహెచ్‌సీలో 2013 ఏప్రిల్‌లో 67 లక్షలతో నిర్మించిన కొత్త భవనంలో ట్రామాకేర్ సెంటర్‌ను ప్రారంభించారు. అవసరాలకు తగ్గట్లు వైద్య పరికరాలు, నియామకాలు మాత్రం జరగలేదు. చెన్నై-కోల్‌కతా, నాయుడుపేట-తిరుపతి మార్గాల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. క్షతగాత్రులకు స్థానిక ట్రామా కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి.. నెల్లూరు, చెన్నై తరలించడానికి సమయం పడుతుండటంతో చాలామంది మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు.
అనంతపురం జీజీహెచ్‌లో ట్రామాకేర్ సెంటర్ అవసరాలకు తగ్గట్లు నియామకాలు జరగకపోవడాన్ని కాగ్ ఆక్షేపించింది. కర్నూలు, కాకినాడ, పెనుకొండ సీహెచ్‌సీల్లోని ట్రామాకేర్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు జీజీహెచ్‌లో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ కేడర్‌లో ఉద్యోగులెవరూ లేరని గుర్తించింది. ఎక్కువ మంది ఒప్పంద సిబ్బందే. వీరికి వేతనాల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. విశాఖ కేజీహెచ్‌లో 30 పడకలకు కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నట్లు కేంద్ర కమిటీ గుర్తించింది. యంత్రాల కొరత ఉంది. జనరల్ సర్జన్, క్యాజువాల్టీ వైద్యులు, ఇతర సిబ్బంది కలిపి 101 మందికిగాను 35మంది మాత్రమే ఉన్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో న్యూరో సర్జన్, రేడియాలజిస్ట్, మత్తుమందు వైద్యులు ఆరుగురు ఉండాల్సి ఉండగా ఒక్కరూ లేరు. వైద్యులు, సిబ్బంది కలిపి 101కి గాను కేవలం 21 మందే ఉన్నారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూల్లోనూ అన్ని పరికరాలు లేవు. నెల్లూరు జీజీహెచ్‌లో ఐసీయూ, జనరల్ వార్డుల్లో 30కుగాను ఆరు పడకలు మాత్రమే ఉన్నాయి. 101మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 13 మంది మాత్రమే పని చేస్తున్నారు. వారిలోనూ అధికశాతం బోధనాసుపత్రిలో పనిచేసేవారే.
Service Roads at Vijayawada Highway conditions విజయవాడలో ప్రమాదాలకు నిలయంగా మారుతున్న రహదారులు..
ఏలూరు జీజీహెచ్‌లో ట్రామా కేంద్రానికి తగ్గట్లు పడకలు ఉన్నా అల్ట్రాసోనోగ్రఫీ, 500 ఎంఏ ఎక్స్‌రే యంత్రాలు లేవు. మత్తుమందు విభాగంలోనూ అరకొర పరికరాలే దిక్కు.73కుగాను 20 మాత్రమే సిబ్బంది పని చేస్తున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో ట్రామా కేంద్రం అవసరాలకు తగ్గట్లు ప్రత్యేకంగా ఉండాల్సిన రెండు ఆపరేషన్ థియేటర్లు లేవు. త్రీడీ అల్ట్రాసోనోగ్రపీ, 500 ఎంఏ ఎక్స్‌రే మిషన్ లేదు. శ్రీకాకుళం జీజీహెచ్‌లో 78కు 37, నెల్లూరు జీజీహెచ్‌లో 75కు 21 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కీలకమైన జనరల్ సర్జరీ, ఆర్థో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇచ్ఛాపురంలో రోడ్డు ప్రమాదం జరిగితే శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తీసుకెళ్లేందుకు గంటన్నర పడుతోంది.
కేంద్ర జాతీయ రహదారుల శాఖ, ఇతర సంస్థలు సంయుక్తంగా 2022 సెప్టెంబరులో చిలకలూరిపేట-నెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేశాయి. 2018 నుంచి 2021 మధ్య 3,321 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 300 మంది వరకు మరణించారు. 1,027 మంది తీవ్రంగా, 2,192 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రులకు తరలించే సమయంలో సీపీఆర్ చేయడంపైనా వైద్య సిబ్బందికి అవగాహన లేదు. అంబులెన్సుల్లో ఎక్విప్‌మెంట్ రిజిస్టర్ కానీ వెహికల్ బ్రేక్‌డౌన్ రిజిస్టర్ కానీ కనిపించలేదు. అంబులెన్సుల్లో అవసరమైన పరికరాల్లో 36 శాతం, మందులు 53 శాతం లేవని స్పష్టం చేశారు. నెల్లూరు, ఒంగోలు ఆసుపత్రుల్లో అదనపు ట్రామాకేర్ స్పెషలిస్టులు, పారా మెడికల్ స్టాఫ్ అవసరం ఉందనీ, పడకల సంఖ్యనూ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చిలకలూరిపేట,మార్టూరు సీహెచ్‌సీల్లో అదనపు స్టాఫ్, జనరల్ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను సమకూర్చాలని సూచించాయి.
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వరం చికిత్స అందించి, వారి ప్రాణాలు కాపాడే 'ట్రామా కేర్ (Trauma Care)' వ్యవస్థ తమిళనాడులో ఆదర్శంగా పనిచేస్తోంది. అక్కడ ప్రమాదాల సంఖ్య 2.27 శాతం పెరిగినా మరణాలు మాత్రం 1.35 శాతం వరకు తగ్గాయి. క్షతగాత్రులకు సత్వరం వైద్యం అందితే మృతుల సంఖ్యను తగ్గించవచ్చని అక్కడి సర్కారు నిరూపిస్తోంది. తమిళనాడులో ప్రత్యేకంగా ట్రామా కేర్ వ్యవస్థకు ఓ కమిషనర్‌ను నియమించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌లో సిబ్బంది 24 గంటలూ సేవలు అందిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని 94 ట్రామాకేర్ కేంద్రాలకు అనుబంధంగా 1,330 అంబులెన్సులు నడుస్తున్నాయి. క్షతగాత్రులకు సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, మొబైల్ ఎక్స్‌రే, క్యాత్‌ల్యాబ్ సహా అత్యాధునిక వైద్య సదుపాయాలతో చికిత్స అందిస్తున్నారు.
ట్రామాకేర్ వైద్యం అందించేందుకు వీలుగా 22 వైద్య కళాశాలల్లో 84 పీజీ సీట్లను తమిళనాడు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 24గంటల పాటు పని చేసే ట్రామా కేంద్రాల్లో 78 మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలి. 20 మంది వరకు స్టాఫ్ నర్సులు, ఆరుగురు చొప్పున రేడియోగ్రాఫర్లు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌లు, ఎలక్ట్రీషియన్లు ఈ కేంద్రాల్లో ఉండాల్సి ఉండగా మన రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవడం లేదు.