CAG Report on Road Widening Construction Works : రహదారులు, వంతెనల విస్తరణ, పునర్నిర్మాణం వంటి పనులపై జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపించిందని కాగ్ స్పష్టం చేసింది. 2023 ఆర్థిక సంవత్సరం చివరికి పూర్తికావాలనే లక్ష్యంతో ఉన్న రహదారుల్లో అత్యధిక రహదారులు, వంతెనల పనులు జరగలేదని, కొన్నే పూర్తయ్యాయని తెలిపింది. కీలకమైన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రాజెక్ట్ పనులు మరీ ఘోరంగా జరిగాయంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుత్తేదారులకు నిధులివ్వకపోవడంతో ఎక్కువ పనులు జరగలేదని తేల్చిచెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ ఖరారుచేసిన లెక్కలు రోడ్ల పనుల దుస్థితి ఎంత అధ్వానంగా ఉందో చెబుతున్నాయి.
ఎన్‌డీబీ ప్రాజెక్ట్ కింద బ్యాంకు రుణంతో 13 ఉమ్మడి జిల్లాల్లో 122 రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. వీటికి 2 వేల 749.04 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి 2021 మార్చిలో గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ పనులు 2023 మార్చి నాటికి పూర్తికావాలి. కానీ రాష్ట్రమంతా కలిపి 2023 మార్చి చివరికి 8.12 శాతం పనులే జరిగాయి. గుత్తేదారులకు ప్రభుత్వం చెల్లించింది రూ.108.05 కోట్లే. కర్నూలు జిల్లాలో 3శాతం, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో 5శాతం పనులే జరిగాయి. కొన్నిచోట్ల గుత్తేదారులకు చెల్లింపులే జరగలేదు.
ఏపీ ఆర్థిక గణాంకాలపై కాగ్ నివేదిక - ఏడాదిలో 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్
అన్ని జిల్లాల్లో కేపిటల్ వర్క్స్ కింద మంజూరైన రహదారుల్లో పనుల్లో పూర్తికానివే అధికంగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లా కావలిలో ఓల్డ్ ఎంసీ రోడ్డును 55 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేలా 2021లో నిధులు మంజూరుచేశారు. 2023 మార్చికే పూర్తికావాల్సి ఉన్నా.. 16శాతం పనులే జరిగాయి.
చిత్తూరు జిల్లాలోని కల్లుపల్లె-చౌడేపల్లి రోడ్డు నుంచి అనంతపురం-పలమనేరు రోడ్డు వరకు 12 కిలో మీటర్ల విస్తరణకు 24 కోట్ల రూపాయలు 2021లో మంజూరుచేశారు. ఇది 2023 నాటికి పూర్తికావాల్సి ఉండగా, 30 శాతం పనులే జరిగాయి. నంద్యాల పురపాలక పరిధిలో 2.5 కిలో మీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు 2021లో 13.40 కోట్లు మంజూరు చేయగా 2023 నాటికి 10శాతం పనులే జరిగాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం-చింతపల్లి-సీలేరు రోడ్డును ఆరు ప్యాకేజీలుగా 84 కోట్ల రూపాయలతో విస్తరించేందుకు 2019లో ప్రభుత్వం మంజూరుచేసింది. ఇవన్నీ 2021కి పూర్తికావాలి. కానీ 2023కి రెండు ప్యాకేజీల్లోనే 82శాతం, 61శాతం పనులు జరిగాయి. మిగిలిన నాలుగు ప్యాకేజీల్లో 6నుంచి 17శాతం పనులే చేశారు.
రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక
వైయస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్లలో 5 కిలోమీటర్ల రోడ్డును 25 కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు 2022లో ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. ఏడాదిలో పనులు పూర్తికావాల్సి ఉండగా, 33 శాతం పనులే చేశారు. గుత్తేదారుకు ఏమీ చెల్లించలేదు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొడికొండ-గోరంట్ల రోడ్డులో 20 కిలోమీటర్లను 28.60 కోట్లతో విస్తరించేందుకు 2022లో నిధులు మంజూరు చేశారు. ఇవి 2023 నాటికి పూర్తికావాల్సి ఉండగా, 25శాతం పనులే జరిగాయి.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డులో వేగావతి నదిపై 10.90 కోట్ల రూపాయలతో 2021లో వంతెన మంజూరైంది. ఇది 2023 నాటికి పూర్తికావాల్సి ఉండగా, అసలు పనులేవీ జరగలేదు. ఇదే రోడ్డులో సువర్ణముఖి నదిపై 12 కోట్ల రూపాయలతో వంతెనను 2020లో ప్రభుత్వం మంజూరుచేసింది. 2023 నాటికి ఇది పూర్తికావాల్సి ఉన్నా, 53శాతం పనులే జరిగాయి.
గుత్తేదారుకు రూపాయి కూడా చెల్లించలేదు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి పాచిపెంట రోడ్డులో వేగావతి నదిపై రూ.8.14 కోట్లతో 2020లో వంతెన మంజూరుచేశారు. ఇది 2023 నాటికి పూర్తికావాలి. 50శాతం పనులే జరిగాయి. అనంతపురం జిల్లా నార్పల వద్ద కూతలేరుపై 25 కోట్ల రూపాయలతో వంతెన 2019లో మంజూరుకాగా, 2023 నాటికి 70శాతం పనులే జరిగాయి.
విడుదల కాని బకాయిలు - నిలిచిపోయిన రోడ్డు పనులు - ప్రజలకు తిప్పలు