Budameru Victims Problems : విజయవాడ ప్రజలను వరద గాయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. సర్వస్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా నిలిచినా పరిహారం విషయంలో మాత్రం ఇంకా చాలా మందికి అందలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తిరుగుతూనే ఉన్నా ఖాతాల్లో డబ్బులు పడటం లేదంటూ వరద బాధితులు ఆవేదన చెందుతున్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడంలో కొందరు అధికారులు అలసత్వం వహించినందునే సాయం అందలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బుడమేరు వరదల కారణంగా విజయవాడ వాసులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. దాదాపు రెండు వారాల నుంచి మూడు వారాల పాటు వరద నీటిలోనే ఉన్నారు. వారికి దాతలు, ప్రభుత్వం అందించిన సాయం కాస్త ఉపశమనం కల్పించింది. అయితే 100 రోజులైనా చాలా మంది వరద బాధితులకు పూర్తిస్థాయి పరిహారం అందలేదు. కాళ్లరిగేలా కార్యాలయాలు చుట్టూ తిరుగుతూనే ఉన్నా కనికరించే నాధుడే లేడంటూ వారు కలత చెందుతున్నారు. కాలనీలో కొందరికి పాతిక వేల పరిహారం వచ్చినా మరికొందరికి రాలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"సెప్టెంబర్లో వరదలు వచ్చాయి. వారం రోజుల పాటు వరదల్లోనే ఉన్నాం. మాకు డబ్బులు వస్తాయని వివరాలు సేకరించారు. కాళ్లరిగేలా కార్యాలయాలు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అయినా పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం నుంచి మాకు రూ.25,000లు అందలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరద సాయం అందిచాలని కోరుతున్నాం." - రత్నకుమారి, వాంబేకాలనీ
నీట మునిగిన ఇళ్లు, వాహనాలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలకు ప్రభుత్వం అదనంగా రూ.10,000ల నుంచి రూ.2 లక్షల వరకు పరిహారం ప్రకటించింది. ఇప్పటికే మెజార్టీ ప్రజలకు సాయం అందింది. తమకు నేటికీ పరిహారం అందలేదని కొందరు రోడ్డెక్కారు. వరద నష్టాన్ని అంచనా వేసి వివరాలు నమోదు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. అందుకే డబ్బులు ఇంకా పడలేదంటూ వారు మండిపడుతున్నారు.
Vijayawada Floods Victims Issue : రెక్కాడితే గానీ డొక్కడని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ జిల్లా సమీక్షా సమావేశంలోనూ వరద సాయంపై ప్రజాప్రతినిధులు స్పందించారు. పరిహారం అందని బాధితులకు తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సర్కార్ను కోరారు.