Budameru Lands occupy in Vijayawada : విజయవాడ నగర పరిధిలో బుడమేరు వాగు భూములు దాదాపు 80 ఎకరాలు ఆక్రమణలకు లోనయ్యాయి. వీటిలో చిన్నచిన్న ఇళ్ల మొదలుకొని బహుళ అంతస్తుల భవనాల వరకూ వేల సంఖ్యలో నిర్మించేశారు. జక్కంపూడి కాలనీ నుంచి ఎనికేపాడు వరకు ఈ కబ్జాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. అంటే ఆక్రమిత స్థలాల విలువ రూ.800 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. గజాల చొప్పున చూస్తే ఈ విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంతే కాదు గ్రామీణంలోనూ ఆక్రమణలు జరిగాయి.
ఆపరేషన్ బుడమేరు దిశగా : విజయవాడను వరదలు ఇటీవల ముంచెత్తిన విషయం తెలిసిందే. నగరంలో సగ భాగం దాదాపు 10 రోజులపాటు జలమయమైంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కొందరు ప్రాణాలు కోల్పోయారు. భారీగా వానలు పడటంతోపాటు ఊహించని విధంగా వరద ముంచెత్తింది. దీంతో పాటు బుడమేరు పరిధిలో జరిగిన ఆక్రమణలూ ప్రధాన కారణమే. అందువల్ల ఈ కబ్జాలపై ఏపీ సర్కార్ సీరియస్‌గా ఉంది. ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఇందులోభాగంగా విజయవాడ నగరం, గ్రామీణం పరిధిలో బుడమేరు ఆక్రమణలపై కలెక్టర్ సృజన సర్వే చేయించారు. ఆ వివరాలతో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.
ఇదీ పరిస్థితి :
- విస్సనపేట, గంపలగూడెం ప్రాంతంలో పుట్టి పలు వాగులను కలుపుకొని బుడమేరు ప్రవహిస్తుంది. ఈ నెల 1న అత్యధికంగా వరద రావడంతో బుడమేరు మళ్లింపు కాలువకు పలుచోట్ల గండ్లు పడి గ్రామాలు మునిగిపోయాయి. 40 గ్రామాల మీదుగా ప్రవహించే బుడమేరు పరీవాహక ప్రాంతం జిల్లాలో 2,930 ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. అయితే ఆక్రమణల కారణంగా బుడమేరు చాలామేరకు కుంచించుకుపోయింది.
- ఈ కబ్జాల నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ, జలవనరుల శాఖల సిబ్బందితో సర్వే చేపట్టారు. వారం రోజుల పాటు సర్వే జరిగింది. బుడమేరు వాగు పలుచోట్ల కుంచించుకుపోయింది. నగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో 30 మీటర్ల వరకు తగ్గిపోయింది.
- విజయవాడ గ్రామీణంలో 260 ఎకరాల మేర బుడమేరును కబ్జా చేసి సాగు చేస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా ఈ వివరాలను అధికారులు సేకరించారు. ఇదే ప్రాంతంలో 40 ఎకరాల పట్టా భూములు సైతం ఆక్రమణలకు గురైనట్లు సర్వే బృందం దృష్టికి వచ్చింది. ఇది బుడమేరు విస్తరణకు సేకరించాల్సిన భూమి కావడం గమనార్హం.
- ఆర్‌ఆర్‌పేట, సింగ్‌నగర్ నుంచి ఎనికేపాడు టన్నెల్ వరకు 80 ఎకరాలను ఆక్రమించారు. బుడమేరు వాగు వెంట, బుడమేరు భూమిలో 3,100 భవనాలను నిర్మించారు. వీటిలో పదుల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటికి రోడ్లు వేసేందుకు కూడా ఇక్కడి స్థలాలను కబ్జా చేశారు. ఇదంతా జరుగుతున్నా జలవనరుల శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
తీసుకోవాల్సిన చర్యలు ఇవీ! : బుడమేరు వాగు వెడల్పు (50 నుంచి 120 మీటర్లు) ప్రామాణికంగా ఉండేలా నిర్ణయించాలి. ఇది అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండేలా చూడాలి. కొన్ని ప్రాంతాల్లో హెయిర్‌పిన్ తరహాలో వంకర్లు తిరిగింది. సరి చేయాలి. బుడమేరుకు సమాంతరంగా పాముల కాలువ నుంచి ఒక వాగు ఉండేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇది కనుమరుగైంది. దీనిని పునరుద్ధరిస్తే కొంత వరద దీని ద్వారా వెళ్తుంది. దీనిని గుర్తించి పునరుద్ధరించాల్సి ఉంది. మరోవైపు బుడమేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే దీనికి ఖర్చు ఎక్కువ కానుంది. ముందుగా ఆక్రమణలను తొలగించి బుడమేరు స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు బుడమేరు ఆపరేషన్ చేపట్టనున్నారు. తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి తెలియజేశానని కలెక్టర్ జి.సృజన తెలిపారు.
- బుడమేరు పరీవాహక ప్రాంతం: 2,930 ఎకరాలు
- వాగు వెడల్పు: 50 నుంచి 120 మీటర్లు
- ఆక్రమణలకు గురైన భూమి: 380 ఎకరాలు
- సేద్యం చేస్తున్న పొలాలు: 260 ఎకరాలు
- నిర్మాణాలు జరిపిన విస్తీర్ణం: 80 ఎకరాలు
- ప్రైవేట్ భూమి ఆక్రమణలు: 40 ఎకరాలు
- భవన నిర్మాణాలు: 3,100