BRS Rythu Deeksha In Telangana : సంగారెడ్డిలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వ మొద్దు నిద్రకు నిరసనగా ఈ దీక్ష చేపట్టామన్న ఆయన ఎండి పోయిన పంటలను కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలన్న హరీశ్ రావు కాంగ్రెస్ గెలవడానికి రైతులకు హామీలు ఇచ్చారని గెలిచాక పట్టించుకోవడం లేదన్నారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఎండిన పంట పొలాల రైతులకు ఎకరాకు రూ.25వేలు పరిహారం, ధాన్యానికి రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Telangana Lok Sabha Elections 2024 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో చేపట్టిన దీక్షలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్ చూసిన పర్వాలేదు కానీ, రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని చూసి రైతులను ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పాత బస్టాండ్ వద్ద రైతు దీక్షను నిర్వహించారు.
రైతులు మళ్లీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది : జగదీశ్ రెడ్డి - BRS MLA Jagadeesh Reddy
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బీఆర్ఎస్ రైతు దీక్ష : వరి ధాన్యానికి మద్దతు ధర, బోనస్ ఇవ్వాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సహా భువనగిరిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతు దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకుల రైతు దీక్షలు : కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రపూరిత చర్యల వల్లే కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని కొందరు వీడుతున్నారని బీఆర్ఎస్ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన కడియం శ్రీహరి,ఆరూరి రమేశ్‌లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం పార్టీకి నమ్మకద్రోహం చేసిన వారిని బీజేపీ, కాంగ్రెస్‌లు చేర్చుకోవడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రాజకీయ ద్రోహులు పార్టీ నుంచి వెళ్లారని ఇకపై ఉద్యమకారులదే బీఆర్ఎస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీపరుడని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.