BRS MLC Kavitha Judicial Remand Extended : దిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఏకంగా నెల రోజుల పాటు ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, దిల్లీ మద్యం విధానంలో కవిత పాత్రపై ఈడీ 6వ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించింది.
పీఎంఎల్ఏ సెక్షన్ 44, 45 కింద మొత్తం 177 పేజీలతో ఛార్జిషీట్ ఫిర్యాదు కాపీ రూపొందించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. అందులో ఎమ్మెల్సీ కవిత 32వ నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 24 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించిన ఈడీ, 18 మందిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. శరత్‌చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించిన ఈడీ, కవిత అసిస్టెంట్ అశోక్, ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్‌మెంట్‌ను ఛార్జీషీట్‌లో చేర్చింది. 44 మంది సాక్షుల జాబితాను ఛార్జిషీట్‌తో జతపరిచిన ఈడీ, కవితపై కోర్టు వెంటనే ట్రయల్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులు జప్తు చేయాలని కోరింది. వీటిని పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం, కవితకు జులై 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇప్పటి వరకు 14 రోజులు మాత్రమే రిమాండ్ పొడిగిస్తూ రాగా, ఈసారి ఏకంగా నెల రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సీబీఐ కేసులోనూ కస్టడీ పొడిగింపు : మరోవైపు సీబీఐ కేసులోనూ ఇవాళ్టితో కవిత కస్టడీ ముగియగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కవితను జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈ నెల 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జూన్ 7న సీబీఐ కవితపై ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ కేసుకు సంబంధించి మార్చి 26వ తేదీ నుంచి కవిత తిహాడ్ జైళ్లో ఉన్న విషయం తెలిసిందే.
వేల కోట్ల ఎగవేతదారులను వదిలేసి.. మహిళపై ప్రతాపం చూపిస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్