BRS MLA Harish Rao Fires on Governor Speech : ఉభయ సభల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగం చాలా పేలవంగా ఉందని, ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. ఆశగా ఎదురు చూసిన ప్రజలకు నిరాశను మాత్రం మిగిల్చిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని గవర్నర్ ప్రసంగం అనంతరం హరీశ్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి తమిళి సై(Tamili Sai) ప్రసంగంపై అభ్యంతరం చెప్పారు.
ఆశగా ఎదురుచూసిన ఆసరా పింఛన్‌దారులకు గవర్నర్ ప్రసంగం(Governor Specch) నిరాశను మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి కింద మహిళలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. కానీ మహిళలకు రూ.2500 ఎప్పటి నుంచి ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదని మండిపడ్డారు. ప్రసంగమంతా శాసనసభను అవమాన పర్చడమే గవర్నర్ గౌరవాన్ని తగ్గించడమేనని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు.
"ప్రజావాణి తుస్సుమందని ప్రతిరోజు విజ్ఞప్తులు స్వీకరిస్తామని సీఎం ఒక్కరోజు మాత్రమే వెళ్లారు. కొన్నాళ్లు మంత్రులు వెళ్లారు కానీ తర్వాత వెళ్లలేదు. అధికారులు కూడా లేరని పొరుగు సేవల సిబ్బంది మాత్రమే దరఖాస్తులు తీసుకుంటున్నారు. రెండు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశామని అర్ధసత్యాలు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. కానీ పాక్షికంగా అమలు చేసి మొత్తం గ్యారంటీ అమలు చేసినట్లు చెప్పడం దురదృష్టకరం." - హరీశ్ రావు , బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము : రేవంత్ రెడ్డి
Governor Tamilisai Assembly Speech : గవర్నర్ ప్రసంగంలో ఆరోగ్య శ్రీ(Arogya Sri) ప్రస్తావన లేదంటే దాని అమలు సరిగ్గా లేదని చెప్పకనే చెప్పారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకారం రెండు రోజుల ముందే చేసిన సీఎం, ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం వాయిదా వేశారని విమర్శించారు. ప్రమాణస్వీకారం మీద ఉన్న ఆత్రుత హామీల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో 60 రోజులు పూర్తయ్యాయని, ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలాయని, మరో 10, 15 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారన్నారు.
గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కూడా మిగిలిన హామీల అమలు ప్రస్తావించలేదని అంటే ఎగనాం పెడతారా అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. అంటే వంద రోజుల్లో ఈ హామీలు అన్నింటిని అమలు చేయలేమని చెప్పకనే చెప్పారన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు మేలు కాదు రెండు నెలల్లో తీవ్ర అన్యాయం చేశారని రైతులకు ఇచ్చిన ప్రతి మాటను తప్పారని ధ్వజమెత్తారు. డిసెంబరు 9న చేస్తామన్న రుణమాఫీ ఫిబ్రవరి 9 వచ్చినా ఇంకా ఎందుకు చేయలేదన్నారు.
దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : దావోస్‌కు వెళ్లి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు కానీ ఎవరెవరు పెట్టుబడులు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ పునరుద్ధరణ(Musi River Restoration) ఇప్పటికే ప్రారంభమైందని మురుగునీరు వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 52 ఎస్టీపీల్లో ఇప్పటికే కొన్నింటిని పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తామన్నారు, కానీ ఏడో తేదీ వచ్చినా సరే ఇంకా జీతాలు పడలేదని ఆక్షేపించారు.
ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై