BRS Legislative Party Meeting: శాసనసభ, మండలి సమావేశాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం సమావేశమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ వారికి దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ సుధీర్ఘంగా వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సమావేశాలకు హాజరై అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని తెలిపారు.
నాడు రైతుబంధు తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని రైతులకు సాయం అందించకుండా ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని సూచించారు. ప్రజాసమస్యలపై గళమెత్తి కొట్లాడాలని, వాణి బలంగా వినిపించాలని అధినేత సూచించినట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు, రైతులను దగా చేసి విజయోత్సవాల పేరిట అవమానపరుస్తున్నారని రైతుల గొంతుగా ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
కాకినాడ సెజ్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా - వైఎస్సార్సీపీకి వర్మ సవాల్
ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయు: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, రానున్న రోజుల్లో సర్కార్‌కు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయని వ్యాఖ్యానించినట్లు సమాచారం. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలను మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. నిర్భంద పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమై నిలదీయాలని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు.
మూర్ఖపు చర్యగా తెలంగాణ తల్లి మార్పు: తెలంగాణ తల్లి విగ్రహం మార్పును మూర్ఖపు చర్యగా కేసీఆర్ సమావేశంలో అభివర్ణించినట్లు తెలిసింది. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అన్న ఆయన, సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి కానీ మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలని, నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలని అన్నారు. లగచర్ల రైతులపై దాడులు, భూసేకరణ గురించి నాడు ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది, పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను వివరించాలని చెప్పారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ: ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరి ఎండగట్టే ఆలోచనలో ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు. ఆ తర్వాత పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు, సభ్యత్వ నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. గురుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై అధ్యయనం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. గురుకులాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విద్యార్థులకు న్యాయం చేసేలా పోరాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ తెలిపారు.
విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్ - మెట్రో ప్రాజెక్టు మొదటి దశ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం