BRS Leaders Jump to Congress : కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్‌ఎస్ నుంచి పలువురు నాయకులు చొరవ చూపుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఉప మేయర్ శ్రీలతా రెడ్డి దంపతులు రేపు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ అనితారెడ్డిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బొంతు రామ్మోహన్‌లు కూడా మర్యాదపూర్వకంగా రేవంత్ నివాసంలో కలిశారు. లోకసభ ఎన్నికలు దగ్గరవుతున్న వేళ ఇతర పార్టీల నుంచి చేరికలు అధికంగా ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. డిప్యూటీ మేయర్ దంపతులతో పాటు ఇతర నాయకులు కూడా ఆదివారం చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలుస్తున్న వారిలో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Telangana Congress Joinings : రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా హస్తం పార్టీలో చేరికలు, గులాబీ పార్టీలో చీలికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ దిశగానే పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.
ఇటీవల ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చర్లపల్లి బీఆర్‌ఎస్ కార్పొరేటర్ శ్రీదేవి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపదాస్ మున్షీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఇతర నేతలంతా అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. వీరిలో చాలామంది వచ్చే లోక్‌సభ ఎన్నికలకు టికెట్ ఆశిస్తున్న వారే ఉన్నారు. వీరందరికి అవకాశం దక్కకపోయినా, ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాలని హస్తం నేతలు ఆహ్వానిస్తున్నారు. దీంతో చాలా మంది గులాబీ నేతలు తెలంగాణ భవన్‌ను విడిచిపెట్టి గాంధీభవన్ గూటికి చేరుకున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ అర్జీలకు నేడే ఆఖరు.. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ఎన్నంటే..?
కాంగ్రెస్ కండువా కప్పుకున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్