Protest at Women Commission Office : మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ బస్సు పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. భారత రాష్ట్ర సమితి మహిళ ప్రతినిధులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కేటీఆర్ వెంట వచ్చారు. హైదరాబాద్ బుద్ధ భవన్‌లోని మహిళా కమిషన్ ముందు హాజరైన ఆయన, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేట్లకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదే సమయంలో కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు బుద్ధభవన్ వద్ద ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. క్షమాపణలు చెప్పేవరకు వదిలిపెట్టబోమంటూ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షురాలు సునీత బైఠాయించారు. సునీతను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. కాంగ్రెస్‌కు పోటాపోటీగా బీఆర్‌ఎస్ మహిళ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం తోపులాటలు, నినాదాలతో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పరిస్థితి రణరంగంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళా కాంగ్రెస్ నేతలు అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై బీఆర్‌ఎస్ మీటింగ్‌లో కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో కుట్లు, అల్లికలు, వద్దు అనట్లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఈ మేరకు మహిళా కమిషన్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై మరుసటి రోజే ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలతో మహిళలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని ట్వీట్ చేశారు. తన అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని కేటీఆర్ వివరించారు. ఈ నేపథ్యంలో ఆ నోటిసులకు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ శనివారం కమిషన్ ఎదుట హాజరు కాగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.