GHMC Council Meeting Today : అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య వాడివేడి చర్చకు నేడు జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వేదిక కానుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం వల్ల బల్దియాలో పార్టీల బలాబలాలు మారాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ ఎర్రగడ్డ, గుడి మల్కాపూర్ కార్పొరేటర్లు మరణించగా, ఎంఐఎం నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలయ్యారు. సభలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లుండగా కాంగ్రెస్‌కు 19, బీజేపీకి 39, బీఆర్ఎస్ 47, ఎంఐఎంకు 41 మంది సభ్యుల బలం ఉంది.
అధికార కాంగ్రెస్‌కు తక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నా మేయర్, డిప్యూటీ మేయర్ బలం తోడవడంతో సభలో ఆధిపత్యం చలాయించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ సభలో తమ వాణి బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు.
మేయర్ రాజీనామాపై బీఆర్ఎస్ డిమాండ్ : కౌన్సిల్ సమావేశం దృష్ట్యా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా డిమాండ్ లేవనెత్తాలని నిర్ణయించారు. ప్రజాసమస్యలు, నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ముక్తకంఠంతో ప్రశ్నించాలని తీర్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు దాటినా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, పారిశుద్ధ్య నిర్వహణ, నాలాల్లో పూడిక తొలగింపు తదితర సమస్యలపై ప్రజా పక్షాన ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ సిద్ధమైంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా బల్దియా పని తీరులో ఎలాంటి మార్పులు లేదని ఆ పార్టీ కార్పొరేటర్ శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. తాగునీటి సమస్యపై నిలదీస్తామని స్పష్టం చేశారు. బల్దియా కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి, కౌన్సిల్ సమావేశం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
'నీటి సమస్యకు సంబంధించిన పనితీరుపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ తరఫున మేయర్, కమిషనర్‌కు డిమాండ్ చేశాం. కొత్త పైపులైన్ల నిర్మాణం లేకపోవడం, కొంత వర్షం పడితే వర్షంనీరు, మురుగు నీరు ఇళ్లల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మేయర్, కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం'- శ్రావణ్ కుమార్, బీజేపీ కార్పొరేటర్