Boy Died After Falling Under the Tractor at Medak : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బోసు రమేష్, శివలక్ష్మి పోతంశెట్టిపల్లిలో నివాసం ఉంటున్నారు. భూమి పంచాయితీ కోసం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ మేరజ్ ఇంటికి వెళ్లారు. పంచాయితీ జరుగుతుండగానే ఇంటి యజమాని కుమారుడు సయ్యద్ ఫాద్ పాషా నిలిపి ఉంచిన ట్రాక్టర్ను వెనకాలకు తీశాడు. అక్కడే రమేశ్ రెండేళ్ల కుమారుడు ఆడుకుంటున్నాడు.
ఇది గమనించక ఆ వ్యక్తి వెనుకకు ట్రాక్టర్ను తీశాడు. దీంతో బాలుడు ట్రాక్టర్ వెనక టైర్ కిందపడ్డాడు. వెంటనే ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమై చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే కుమారుడు విగతజీవిగా మారడంతో కన్నవారి రోదనలు మిన్నంటాయి.
గ్రామస్థుల దాడి : కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు, గ్రామస్థులు ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. అజాగ్రత్తగా నడపడం వల్లే చిన్నారి మృతి చెందారని ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. ఈ విషయంపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి యజమానిపై దాడి చేసిన వారిని అడ్డుకుని పోలీసులు నచ్చజెప్పారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలు : మరో ప్రమాదంలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాపడి పది మంది రైతు కూలీలకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషయంగా మారింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూక అయిజ మున్సిపాలిటీ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మపేటకు చెందిన ట్రాలీ ఆటో ఉదయం 30 మంది కూలీలతో వెళుతోంది. ఒక్కసారిగా వాహనం బోల్తాపడడంతో 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ట్రాలీ ఆటో వేగంగా వెళుతున్న క్రమంలో అదుపు తప్పి ప్రమాదం సంభవించింది. తీవ్రగాయాలైన వారిని హుటాహుటిగా కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టైర్ పేలి ట్రక్కును ఢీకొన్న కారు- 8మంది మృతి- మరో ప్రమాదంలో ఆరుగురు మరణం - Road Accident