Bombs in YSRCP Leaders Houses: పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బాంబుల కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో నాటుబాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి గ్రామంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు, అందుకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీలు చేస్తుండగా వైఎస్సార్సీపీ గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులు కనుగొన్నారు.
నాటుబాంబులతో పాటు పెట్రోల్ బాంబులు ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్ రోజు విధ్వంసం కోసం వైఎస్సార్సీపీ వారు ఈ బాంబుల్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ముందుగానే రెండు పార్టీల వారిని గొడవలకు దిగొద్దని హెచ్ఛరించారు. దీంతో పోలింగ్ రోజున ఎవరి ఓట్లు వారు వేసుకున్నారు. పోలింగ్ మరుసటి రోజు గ్రామాల్లో కొంత ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో పోలీసులు ఇవాళ ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ బాంబులను గుర్తించారు.
ఈ బాంబులను వాడి ఉంటే భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగేదని పోలీసులు భావిస్తున్నారు. పిన్నెల్లి గ్రామం మొదటి నుంచి అత్యంత సమస్యాత్మకమైనది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు టీడీపీ వారిపై దాడులు జరిగాయి. గ్రామంలో ఉండలేక టీడీపీ వర్గీయులు ఊరు విడిచి హైదరాబాద్, గుంటూరు వెళ్లిపోయారు. పోలీసులు కూడా వారికి రక్షణ కల్పించలేకపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించిన తర్వాత ఇటీవలే టీడీపీ వర్గీయులు గ్రామానికి వచ్చారు.
బాంబుల మోతతో దద్దరిల్లిన తంగెడ- భయంతో గజగజలాడిన స్థానికులు - YSRCP Activists Bomb Attacks