Bollywood Actress Kadambari Case : ఏదైనా ఘటన జరిగితే, పోలీసులు తొలుత కేసు పెట్టి, తర్వాత దర్యాప్తు చేయడం సహజం. మాజీ సీఎం జగన్ భక్త ఐపీఎస్‌లు మాత్రం నటి కాదంబరీ జత్వానీ వ్యవహారంలో అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబయికి విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని, దొరికిపోయారు.
డీజీపీ ద్వారకా తిరుమలరావు నివేదిక : వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 2న ఉదయం 6.30కి ఫిర్యాదు చేశారు. అదే రోజు 11.30కి విమానంలో డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం ముంబయికి వెళ్లింది. ఈ విమాన ప్రయాణం టికెట్లు ఫిబ్రవరి 1న బుక్ చేశారు. అంటే, విద్యాసాగర్ ఫిర్యాదుకు ముందురోజన్న మాట! దీన్నిబట్టే ఇందులో కుట్ర కోణం తెలుస్తోంది. సంచలనం సృష్టించిన కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు, అరెస్టు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నివేదిక డీజీపీ ద్వారకా తిరుమలరావు ద్వారా ప్రభుత్వానికి చేరింది.
రంగంలోకి వైఎస్సార్సీపీ ముఖ్య నేత : ముంబయి పారిశ్రామికవేత్త పేరు ఎక్కడా బయటకు రాకుండా వ్యవహారాన్ని చక్కబెట్టాలని అప్పటి 'ముఖ్య' నేత ఆదేశాలతో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పి.సీతారామాంజనేయులు రంగంలోకి దిగారు. దీనిపై జనవరి 31న విజయవాడ సీపీ కాంతిరాణా తాతాతో చర్చించినట్లు తెలిసింది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏదో కేసు పెట్టి, వెంటనే కాదంబరిని అరెస్టు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పిలిపించి జత్వానీకి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇప్పించారు.
తన ఆస్తిపై జత్వానీ తప్పుడు ఒప్పంద పత్రాన్ని సృష్టించి, ఇతరులకు విక్రయించినట్లు ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు పెట్టారు. ఆమె అరెస్టు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కాంతిరాణా తనకు అనుకూలురైన అధికారులను వినియోగించారు. ముంబయికి వెళ్లడం, అక్కడ కాదంబరితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్‌కు పంపడం వరకూ కాంతిరాణా, విశాల్ గున్ని నేరుగా పర్యవేక్షించారు. జత్వానీ పేరిట ముంబయిలో స్టాంపు పేపర్ కొనుగోలు చేసి, 2018లో రాసినట్లు సృష్టించారు. ఇందులో వైఎస్సార్సీపీకి చెందిన ఓ న్యాయవాది కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
పూసగుచ్చినట్లు వివరించిన పోలీసులు : ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా సీతారామాంజనేయులుగా తేలింది. 'ముఖ్య' నేత చెప్పగానే రంగంలోకి దిగిన పీఎస్‌ఆర్, కాదంబరిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో ఆయనే చూసుకున్నారు. దీంతో పీఎస్‌ఆర్‌తో పాటు కాంతిరాణా, విశాల్ గున్ని, స్థానిక దర్యాప్తు అధికారి వరకూ అందరిపైనా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కుట్రలో పాత్రధారులైన కొందరు పోలీసులు తమకు చిక్కులు తప్పవని భావించి, అప్రూవర్లుగా మారారు. నాడు ఉన్నతాధికారుల ఆదేశానుసారమే తాము నడుచుకున్నామని దర్యాప్తు అధికారి స్రవంతిరాయ్ ముందు పూసగుచ్చినట్లు వివరించారు.
సినీ నటి కేసులో సాక్ష్యాధారాలను భద్రపరచండి : హైకోర్టు - AP HC on kadambari Jethwani Case
తప్పు ఒప్పుకున్న వైఎస్సార్సీపీ నేతలు : కాదంబరిపై కేసు నమోదు, అరెస్టు, రిమాండ్ ప్రక్రియల్లో అన్ని దశల్లోనూ తాము చట్టబద్ధంగానే వ్యవహరించామన్న భ్రమ కల్పించేందుకు పోలీసులు పలు ఎత్తుగడలు వేసినట్లు సమాచారం. అవన్నీ జత్వానీ ఫిర్యాదు తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. సెర్చ్ వారెంట్, ట్రాన్సిట్ వారెంట్, ముంబయిలో స్థానిక పోలీసులతోనే మధ్యవర్తుల పంచనామా, తదితర అంశాల్లో పక్కాగానే చేశారు. కాకపోతే, ఒప్పంద పత్రంలోని అంశాలు, సాక్షులుగా ఎంచుకున్న వారు వైఎస్సార్సీపీ నేత అనుకూలురు కావడం, వారు నేడు వాస్తవాలు వెల్లడించడంతో కుట్రకోణం బలపడింది. అరెస్టు సమయంలో కాదంబరి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లోంచి కొన్ని ఆధారాలను పోలీసులు అప్పట్లోనే ధ్వంసం చేశారు. వీటిని తాజాగా ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు.
కుక్కల విద్యాసాగర్‌పై కేసు? : తప్పుడు కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను జైలు పాలు చేసి వేధించిన ఉదంతంలో ఐపీఎస్‌లు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలక వ్యక్తులు అని కాదంబరి జత్వానీ ఇటీవల దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్ దృష్టికి తెచ్చారు. తనపై వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారని, అతనిపై కూడా కేసు పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విద్యాసాగర్‌పై విజయవాడలో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.