Old Woman Was Taken to Crematorium While Still Alive : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని రక్త సంబంధీకులు శ్మశానానికి తరలించిన అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ(60) భర్త కొన్నాళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె పద్మానగర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా జీవనం సాగిస్తోంది.
మూత్రపిండాల అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ : మూత్రపిండాలు పాడవడంతో తంగళ్లపల్లిలోని తన సోదరుడి కుమారుడైన తిరుపతి ఇంటికి కొద్ది రోజుల కిందట వెళ్లి అక్కడే నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. ఈ విషయం తెలుసుకున్న బస్వాపూర్, మండెపల్లికి చెందిన రాజవ్వ అక్కాచెల్లెళ్లు భూమవ్వ, ఎల్లవ్వలు ఆమెను చూసేందుకు తంగళ్లపల్లి వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సిరిసిల్లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండు రోజులు చికిత్సను అందించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో సోమవారం రాజవ్వను తంగళ్లపల్లిలోని తిరుపతి ఇంటికి తీసుకెళ్లారు.
బతికుండగానే శ్మశాన వాటికకు తరలింపు : మీ ఇంటికి తీసుకుపోతామని చెప్పి మళ్లీ ఇక్కడికే తీసుకొచ్చారేంటని ఆమె అక్కాచెల్లెళ్లను తిరుపతి ప్రశ్నించగా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో రాజవ్వను నేరుగా శ్మశాన వాటికకు తరలించి సోమవారం రాత్రంతా వారూ అక్కడే వేచి ఉన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం తహసీల్దార్ జయంత్‌కుమార్, ఎస్సై రామ్మోహన్ స్పందించి సిబ్బందిని పంపించి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి ఎట్టకేలకు వృద్ధురాలిని తిరుపతి ఇంటికి తరలించారు.
కనుమరుగవుతున్న మానవ సంబంధాలు : మానవ సంబంధాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు కుటుంబంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే కుటుంబ సభ్యులు మేమున్నామని భరోసాగా నిలిచే వారు. ఆసరా అయ్యేవారు. కాలం మారేకొద్ది ఈ సంబంధాలు కనిపించకుండా పోతున్నాయి. జీవితాంతం తోడుంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్య, భర్తను దారుణంగా హత్య చేస్తే మరో వైపు భార్యను భర్త హత్య చేస్తున్నాడు. అలాగే సోదరుల మధ్య భూ వివాదాలు జరిగి దాడులు చేసుకుని ఒకరిపై ఒకరు కేసులు పెట్టకుంటున్నారు. తల్లిదండ్రులు తమకు ఆస్తులు రాసివ్వలేదని వారిని కుమారులు, కుమార్తెలు ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు.
స్నేహమంటే ప్రాణం ఇవ్వాల్సిన మిత్రులే మోసం చేసి దారుణ హత్యలు చేసే స్థాయికి వెళ్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి అమానవీయ ఘటనలు వెలుగు చూస్తూ చర్చనీయాంశంగా మారుతోంది. సమాజంలో రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతుండగా నేర ప్రవృత్తి మాత్రం పెరుగుతోంది. దెబ్బతింటున్న మానవ సంబంధాలను మళ్లీ బతికించేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తూనే ఉన్నాయి.