Black Gram Crop Dried: ఇప్పటికే మిగ్‌జాం తుపానుతో నిండా మునిగిన రైతన్నను, ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. వరి పంట ఎలానూ చేతికి రాలేదు. కనీసం అపరాల సాగు ద్వారానైనా కోలుకుందామనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. కాలువల నుంచి నీరు పారక పొలాలు బీళ్లుగా మారాయి. పచ్చగా కళకళలాడాల్సిన పంటలు, జీవం కోల్పోయి మోడు వారాయి. కనీసం తడి లేక మినప మొక్కలు ఎండిపోతున్నాయి. లాభాల మాట అటుంచితే, కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని కృష్ణా జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది.
నెర్రలు బారిన వరిచేలు.. నీరందించాలని రైతుల వేడుకోలు
ఎటుచూసినా నెర్రెలు చాచిన పొలాలు, ఎండుతున్న మినుము పైరు. ఇదీ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని పరిస్థితి. గతంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు కురవడంతో, వరి కోసి ఉన్న పోలల్లో హడావుడిగా దమ్ము చేసి మినుము పంటలు సాగు చేశారు. భూమిలో తడిపోతే మళ్లీ నేలను తడిపి పంటను విత్తాల్సి ఉంటుందని శ్రమను, నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని హడావుడిగా విత్తనాలు విత్తల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. ఇప్పుడు ఆ మినప పంటను సాగు చేస్తున్న భూములే గట్టిపడి నీరు లేక బీటలు వారాయి. కనీసం తడులు లేక మొక్కలు ఎండుతున్నాయి.
గుడ్లవల్లేరు మండలంలోని చాలా గ్రామాల్లో ఇవే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కౌతవరం, బలరామపురం, వడ్లమూడి, డోకిపర్రు గ్రామాల్లో పొలాలు మరింత దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ అలసత్వం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా డెల్టాల్లో కన్నీటి ప్రవాహం.. అల్లాడుతున్నా రైతులు.. మంత్రులు, వైసీపీ నేతల మొద్దునిద్ర
"నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏ కాలువలు, బోర్లు చూసినా నీళ్లు లేవు. డ్రమ్ములు, కూలీల సాయంతో ఎన్ని నీళ్లను మోయగలరు." - వేణు, మినుము రైతు
"పంటలు తడపడానికి నీళ్లు లేవు. ఎండిపోయి నెర్రలు చాచాయి. మాకు నీళ్లు కావాలి. పెట్టుబడి ఎకారానికి 15 వేల వరకు ఖర్చయ్యింది " - మాలక్ష్మయ్య, మినుము రైతు
రైతుల సమస్యపై పోరుబాట - పంటలు పరిశీలించిన జనసేన, కలెక్టరేట్ల వద్ద బీజేపీ ధర్నా
గత వర్షాకాల సీజన్లో వరి సాగు చేసిన అన్నదాతలు వేల రూపాయలు నష్టపోయారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వాటికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదు. ఇప్పుడు అపరాల సాగులో మరోసారి రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. మినపకు నీళ్లు కావాలి మొర్రో అని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండుతున్న పంటను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. డ్రమ్ములతో నీరు తెచ్చి మొక్కలకు తడులు అందిస్తున్నారు. ఆశకోల్పోని రైతులు మరోవైపు పంటలకు మందులు చల్లుతూనే ఉన్నారు.
"ఈ సంవత్సరం అపరాలు దిగుబడి పూర్తిగా తగ్గిపోయేలా ఉంది. పెట్టుబడి కూడా రాకపోవచ్చు. ఎవరూ పట్టించుకునే వారు లేరు." -నాగేంద్ర బాబు, మినుము రైతు
Crops Drying Due to Lack of Irrigation నీరులేక ఎండిన పంట.. ఆరుగాలం కష్టించిన రైతు కంట కన్నీరు..