BJP MLA Alleti Maheshwar Reddy On Sunkishala Issue : నల్గొండ జిల్లా సుంకిశాల ప్రాజెక్టు పంప్ హౌస్ రిటైనింగ్ వాల్ ఈ నెల 2వ తేదీన నిర్మాణం జరుగుతున్న క్రమంలో కూలిపోయింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలతోనే సరిపెట్టుకున్నాయి. ప్రాజెక్ట్ సందర్శన వంటి కార్యాచరణను హస్తం, గులాబీ పార్టీలు ప్రకటించనే లేదు. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన, కాంగ్రెస్ హయాంలో గోడ కూలిపోవడం ఇప్పుడు కమల దళానికి కలిసిరానుంది. ఈ రెండు పార్టీలు ఒక్కటే అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
సుంకిశాలను సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు : స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు దొరికిన సుంకిశాల అస్త్రాన్ని వాడుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్లను దెబ్బ కొట్టాలని కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నల్గొండలోని సుంకిశాలను సందర్శించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్, ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి బృందం బయల్దేరి వెళ్లింది. నియోజకవర్గంలో పనుల రీత్యా మిగతా ఎమ్మెల్యేలు సందర్శనకు రాలేకపోయారు.
మేఘా కంపెనీ మీద ఆరోపణలు చేస్తూనే ప్రాజెక్టులు : బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూలిన పంప్ హౌస్ రిటైనింగ్ వాల్‌ను పరిశీలించింది. కూలిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంది. సుంకిశాల ఘటన జరిగి 12 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. గుత్తేదారుని కాపాడుకోవడం కోసమేనా అని ప్రశ్నించారు. అధికారుల అనుమతి లేకుండా గుత్తేదారు టన్నెల్ ఓపెన్ చేశారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు.
అతి చిన్న నష్టం జరిగిందని మంత్రులు చెబుతున్నారని, ఎలాంటి నివేదిక రాకుండానే అతి చిన్న నష్టం వాటిల్లిందని ఎలా చెప్పగలరన్నారు. షిఫ్ట్ బంద్ కావడం వల్ల వందలాది ప్రాణాలు కాపాడుకోగలిగామన్నారు. లేకపోతే వందలాది మంది ప్రాణాలు కోల్పోయేవారని వాపోయారు. మేఘా కంపెనీ నాసిరకం పనులు చేస్తుందని ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి అనేకసార్లు ఆరోపించి, ఇప్పుడు మేగా కంపెనీకే ప్రాజెక్టులు కట్టబెట్టుతున్నారని విమర్శించారు.
గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ఈ గోడ కూలింది : గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ఈ గోడ కూలిపోయిందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆరోపించారు. గుత్తేదారు లైసెన్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుంకిశాల గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం గోప్యత వహిస్తుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ మండిపడ్డారు. ఎవ్వరూ చనిపోలేదని చెబుతున్న మాకు అనేక అనుమానాలు కల్గుతున్నాయన్నారు. ప్రభుత్వంతో గుత్తేదారుకు లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సీబీఐ విచారణకు అదేశించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేస్తే దీనికి ఎవ్వరూ బాధ్యత వహించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్. రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.