BJP Central Election Committee Meeting Today : పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఖరారే అజెండాగా బీజేపీ(BJP) కేంద్ర ఎన్నికల కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 120 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ హాజరు కానున్నారు.
తొలి జాబితాలో పది పేర్లు ప్రకటించే అవకాశం : తొలి జాబితా(TS BJP Lok Sabha First List)లో రాష్ట్రానికి చెందిన 10 మంది పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మహబూబ్‌నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అర్వింద్, కరీంనగర్-బండి సంజయ్, ఆదిలాబాద్-సోయం బాపూరావు, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్ నగర్-డీకే అరుణ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
Lok Sabha Election 2024 : ఈ క్రమంలో మల్కాజిగిరి స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, చాడ సురేశ్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి మల్కాజ్గిరి సీటును ఆశిస్తున్నారు. ఈటలకు మల్కాజ్గిరి స్థానం కేటాయిస్తే రఘునందన్ రావుకు మెదక్ సీటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మల్కాజిగిరి నుంచి మురళీధర్‌రావుకు అవకాశం కల్పిస్తే ఈటలను మెదక్ బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్సాహంగా సాగుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర - కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కమలం నేతల ఫైర్
బీజేపీ విజయ సంకల్ప యాత్రలు : ఈసారి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 ఎంపీ స్థానాలు గెలుపే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra)ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు సంకల్ప యాత్రలను ప్రారంభించింది. కృష్ణమ్మ క్లస్టర్, కుమురం భీం క్లస్టర్, భాగ్యలక్ష్మి క్లస్టర్, రాజరాజేశ్వర క్లస్టర్ వంటి నాలుగు యాత్రలను ప్రారంభించగా, మరొకటి ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఈ క్లస్టర్స్ అన్ని కలిపి రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చింది, పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ద్వారా ఎంతమంది లబ్ధి పొందారనే విషయాలను నేరుగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే బాధ్యతను తీసుకున్నారు. ఈ సమావేశాలకు కేంద్రమంత్రులు, వివిధ బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈసారి బీజేపీ 400 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది.
10 ఎంపీ సీట్లకు పైగా గెలవడమే లక్ష్యం - పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కమలదళం